మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. గెలిచిన మంచు విష్ణు కు అభినందనలు తెలుపుతూనే, ప్రకాష్ రాజ్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ట్వీట్ చేస్తూ, “మా” అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.
జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది. మా ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. “మా” ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు. భారత్ మాతాకి జై !” అని ట్వీట్ చేసారు.
ప్రకాష్ రాజ్ గతంలో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తూ పలుసార్లు ప్రశ్నించిన కారణంగా తెలంగాణ బిజెపి అధినేత బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై విమర్శలు ఎదురవుతున్నాయి. అసలు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కి సినిమా ఎన్నికలతో సంబంధం ఏంటి అని ఒకరు ప్రశ్నిస్తే, మరొకరు గతంలో మంచు విష్ణు- రావణుడు కూడా రాముడి లాగా గొప్పవాడే అన్న వ్యాఖ్యలు బయటకి తీస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు ని బీజేపీ అధ్యక్షుడిగా మీరు సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంకొందరైతే బిజెపి పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బాబు మోహన్ నీ మూవీ ఆర్టిస్ట్ చిత్తుగా ఓడించారు కాబట్టి నువ్వు అన్న తుకుడే గ్యాంగ్ పదం బాబు మోహన్ గురించేనా అంటూ బండి సంజయ్ పై సెటైర్లు విసిరారు. ఈ లెక్కన చూస్తే జీవిత ప్రకాష్ రాజ్ తరపున పోటీ సి ఓడిపోయినా, ఆవిడ కూడా బిజెపి పార్టీ సభ్యులే అని మరికొందరు బండి సంజయ్ కి గుర్తు చేశారు. ఇంకొందరు గతంలో బాలకృష్ణ మోడీ తల్లిని దూషిస్తూ మాట్లాడాడని, ఇప్పుడు అదే బాలకృష్ణ పరోక్షంగా మంచు విష్ణు ప్యానల్ కి సపోర్ట్ చేశాడని, బాలకృష్ణ తో పోలిస్తే ప్రకాష్ రాజ్ మోడీని ఎప్పుడు బూతులు తిట్ట లేదని కేవలం పాలసీల పరంగా ప్రశ్నించారని గుర్తు చేశారు.
మొత్తం మీద బండి సంజయ్ వ్యాఖ్యల పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
"మా" ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. "మా" ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు.
భారత్ మాతాకి జై !#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021