తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కొంత మందికి కొత్త కార్యవర్గం నచ్చలేదు. కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై… బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరవుతున్నారు. తాను చెప్పిన వారికి… ఎవరికీ ఒక్కటంటే.. ఒక్క పదవి ఇవ్వలేదని .. కనీసం కమిటీని ప్రకటించే ముందు .. ఒక్క ఎమ్మెల్యేను అయిన తనను ఎందుకు సంప్రదించలేదని ఆయనంటున్నారు. నిజానికి రాజాసింగ్ నిత్య అసమ్మతి వాది. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు.. ఆయనతో సరిపడేది కాదు. లక్ష్మణ్ ఉన్నప్పుడు కూడా అంతే.
కారణం ఏమిటో కానీ… రాజాసింగ్‌కు.. ఎవరూ ప్రాధాన్యం ఇవ్వరు. బీజేపీ మార్క్ హిందూత్వ రాజకీయాల్లో రాజాసింగ్ చాలా చురుగ్గా ఉంటారు. వివాదాలకు ముందు వెళ్తారు. ఆయన తీరు వల్ల… పార్టీకి చెడ్డ పేరు వస్తుందనో..లేకపోతే ప్రోత్సాహం ఇస్తే.. ఆయన ఎదిగిపోతారని అనుకుంటారేమో కానీ… బీజేపీలో పెద్దగా పదవులేమీ దక్కవు. అయితే..అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉనికి నిలబెట్టింది మాత్రం..రాజాసింగ్ ఒక్కడే. బండి సంజయ్ కొత్త టీమ్‌పై…కొంత మంది సీనియర్ నేతలకు కూడా అసంతృప్తి ఉంది.
తాము చెప్పిన వారికి చోటు కల్పించలేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే… ఆ అసంతృప్తి అంతా అంతర్గతంగానే సాగుతోంది. బీజేపీలో కాంగ్రెస్‌లా వాతావరణం ఉండదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొంత మంది ముఖ్య నేతలు.. తమ అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారు.సుదీర్ఘ కాలంగా ఉన్న వారు మాత్రం… ప్రాధాన్యత లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ అసంతృప్తిని బండి సంజయ్ ముందు తొలగించాల్సి ఉంది.