ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కౌంటర్‌గా డ్రగ్స్ కేసును తెరిపిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలి కాలంలో రోజూ బెదిరింపులకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆయన బెంగళూరు డ్రగ్స్ కేసుపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏడాదిన్నర కిందట బెంగళూరులో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఆ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, సినీ తారల పేర్లు ముఖ్యంగా తెలంగాణ వారివి ప్రచారంలోకి వచ్చాయి. ఇక నోటీసులు ఇచ్చి వారిని అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకెళ్లమే మిగిలిందని అనుకున్నారు. కానీ తర్వాత కేసు చల్లబడిపోయింది.
ఈ కేసు అంశాన్ని ఇప్పుడు బండి సంజయ్ తెరపైకి తెస్తున్నారు. కర్ణాటకలో ఉంది తమ ప్రభుత్వమేనని .. ఆ కేసును బయటకు తెప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని జైలుకు పంపిస్తామని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ అన్న ప్రచారం ఉంది. అందుకే బండి సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఆ కేసు అప్పట్లోనే తేలిపోయింది. అయితే పోలీసులు… ఎమ్మెల్యేలు.. ఇతరులకు డబ్బులిచ్చి మేనేజ్ చేశారని.. కానీ తాము వదిలి పెట్టబోమని బండి సంజయ్ అంటున్నారు.
తాజాగా ఆయన డ్రగ్స్ ఆరోపణల్ని కేటీఆర్ మీదకూ మళ్లించారు. కేటీఆర్ డ్రగ్స్ కు బానిసని.. కావాలంటే టెస్టులకు రావాలని సవాల్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ పేరుతో హడావుడి చేశారు. కేటీఆర్‌కు సవాల్ చేశారు. టెస్టులకు రావాలని ఒత్తిడి చేశారు. అయితే కేటీఆర్ తనపై ఆరోపణలు చేయకుండా.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పట్లో రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్‌ను కొండా విశ్వేశ్వర్ రెడ్డి. .. బండి సంజయ్ స్వీకరించారు. ఇప్పుడు అలాంటి టెస్టుల సవాలే.. కేటీఆర్‌కు మళ్లీ బండి సంజయ్ చేశారు.