టీఆర్ఎస్లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతూండటంతో ఆ పార్టీతో మైండ్ గేమ్ ప్రారంభించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్‌పై ఇతర నేతల్లో అసంతృప్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సీనియర్ మంత్రి ఈటల రాజేందర్‌ను దువ్వేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. టీఆర్ఎస్లో కేటీఆర్ సీఎం కావాలని ఉద్యమ ద్రోహులు మాత్రమే కోరుకుంటున్నారని.. నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని బండి సంజయ్ చెబుతున్నారు. అదే సమయంలో.. మంత్రి ఈటలపై సానుభూతి చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు టీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని… ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఈటలను ముందుపెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని బండి సంజయ్ అంటున్నారు.
కొద్ది రోజుల క్రితం.. కేటీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కక పోతే ముగ్గురు ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని బండి సంజయ్ ప్రకటించారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే మంత్రివర్గ ప్రక్షాళన తప్పదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సారి మంత్రి పదవులు దక్కవని ప్రచారం జరుగుతున్న వారిలో ఈటల, గంగుల కమలాకర్ లాంటి వాళ్ల పేర్లు ఉన్నాయి. ఈ కారణంగానే ఈటలను మరింత దువ్వే ప్రయత్నాన్ని బండి సంజయ్ చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో.. కేసీఆర్ తాను సీఎంగా ఉండలేకపోతే.. మార్చాలని అనుకుంటే … తన తర్వాతైన దళితుడిని సీఎం చేయాలని ప్రజలు కోరుతున్నారనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
టీఆర్ఎస్ లో నాయకత్వ మార్పుపై చర్చ పెరిగే కొద్దీ.. బండి సంజయ్.. ఆ విషయంలో టీఆర్ఎస్ను ఇరికించేందుకు తనదైన శైలిలో ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో నాయకత్వ మార్పిడి అనేది అంత సులభం కాదు. పైగా ఇప్పుడు టీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితిని బండి సంజయ్ అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని చూస్తున్నారు.