నా పేరు బండి సంజయ్ కుమార్, కరీంనగర్ ఎంపీని, ఇక్కడ చాలామంది అధికారులు నన్ను మరచిపోయారు, కొన్ని శాఖల అధికారులకు నేను తెలీదు, అందుకే నాపేరు స్వయంగా గుర్తు చేస్తున్నా… ఇలా పరిచయం చేసుకున్నారు భాజపా ఎంపీ! కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఇలా స్పందించారు. ఆయనకి మొదట్నుంచీ ఇదే సమస్య. జిల్లాలో తనని పట్టించుకోవడం లేదనీ, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారంగా తనని పిలవాల్సి ఉన్నా, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు వేసే శిలాఫలకాలపై తన పేరును ఉద్దేశపూర్వకంగా పెట్టడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశమే కేంద్రానికి కూడా ఆ మధ్య ఫిర్యాదు చేశారు.
తాజా సమావేశంలో ఆయన కేంద్ర నిధులు, పథకాల అమలుపై అధికారులకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు చాలా అమలౌతున్నాయనీ, కానీ వాటి గురించి అధికారులు ఎవ్వరూ ఎక్కడా మాట్లాడరేం అన్నారు! కేంద్రం నుంచి వస్తున్న నిధుల గురించి ఏ ఒక్క అధికారీ ఎవరికీ చెబుతున్న దాఖలాలు లేవని క్లాస్ తీసుకున్నారు. కేంద్రం నుంచి ఏవైనా నిధుల అవసరాలుంటే తనకు చెప్తే, తాను తీసుకొస్తానన్నారు. కేంద్ర పథకాలు కూడా ప్రజలకు మంచి చేయడానికే ఉన్నాయనీ, వాటిని వేరుగా చూడొద్దన్నారు. రాజకీయాలు మేం చేసుకుంటామనీ, అధికారులు తమ పనులు తాము చేసుకుంటూ పోవాలన్నారు.
సంజయ్ ఆవేదన ఏంటంటే… ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వాలనేది, కేంద్ర పథకాల గురించి అధికారులు ప్రజలకు చెప్పాలని! ఈ రెండూ తెరాసకు చేసుకోవాల్సిన విజ్ఞప్తులు. పథకాలను ప్రచారం చేయాల్సిన అవసరం అధికారులకు ఏముంటుంది? ప్రోటోకాల్ విషయానికొస్తే, రాష్ట్ర పెద్దల ఆదేశాలను అధికారులు పాటించాల్సి ఉంటుంది కదా! ఎంపీ ఇలాంటి సమావేశం పెడితే జిల్లా నాయకులు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, ఈ సమావేశానికి జిల్లా మంత్రులు ఎవ్వరూ రాలేదు! మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, సతీష్ కుమార్…. సమావేశంలో వీళ్ల కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. ఎమ్మెల్యేలూ మంత్రులూ రాకపోతే ఎంపీపీ స్థాయి నాయకులు ఎందుకొస్తారు, వాళ్లూ రాలే? ఈ మధ్య తెరాస, భాజపాలకు అస్సలు పడటం లేదు. ఇలాంటప్పుడు భాజపా ఎంపీ రమ్మంటే తెరాస నేతలు వెళ్తారా..? తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదూ అంటూ ఆవేదన వ్యక్తం చేసే సంజయ్ కి, తెరాస నేతలు డుమ్మా కొట్టడంతో అది మరింత పెంచినట్టే అయింది..!