బండి సంజయ్ , కిషన్ రెడ్డి నాయకత్వాన్ని తూర్పారబట్టే ఎమ్మెల్యే రాజాసింగ్ మొత్తానికి మెత్తబడ్డారు. పార్టీ లైన్ లోనే ఆయన పని చేస్తారని, రాజాసింగ్ తో భేటీ అనంతరం బండి సంజయ్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం పోరాడే ఖట్టర్ హిందూ అని ప్రశంసించారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాలను తప్పుబడుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావును పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా, రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే పాతబస్తీలోని అకాష్ పూరి హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్ తో బండి సంజయ్ సమావేశం అయ్యారు. పార్టీలో సమస్యలు అవే సర్దుకుంటాయని, పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాలని రాజాసింగ్ ను కోరారు. అనంతరం గౌతమ్ రావు అభ్యర్థిత్వాన్ని కూడా బలపరిచారు. అయితే , ఈ భేటీ కమలం కాంపౌండ్ లో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసు నడుస్తోంది. తను రేసులో లేనని బండి చెబుతున్నప్పటికీ.. ఆయన తనను వ్యతిరేకిస్తున్న రాజాసింగ్ తో అనూహ్యంగా భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. ఈటల రాజేందర్ ప్రధానంగా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బండి ఆయనతో సమావేశం కావడం పలు అనుమానాలను లేవనెత్తుతోంది.