కేసీఆర్‌ను ఓడించడానికి అమిత్ షా రానక్కర లేదు.. బండి సంజయ్ చాలు అంటూ తుక్కుగూడ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజే్పీలో ఉన్న నాయకత్వ పోరుకు అంతం పలికిపోయినట్లయింది. ఇక నుంచి బండి సంజయ్ మాత్రమే ఏకైక లీడర్ అని అమిత్ షా చెప్పకనే చెప్పారని సంజయ్ వర్గం ఘనంగా ప్రకటించుకుంటోంది. నిజానికి బండి సంజయ్‌కు వ్యతిరేక వర్గం బలంగానే ఉంది. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువురు సీనియర్ నేతలు బండి సంజయ్ ఇంత వేగంగా దూసుకు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కిషన్ రెడ్డి ఇప్పటి వరకూ తెలంగాణ బీజేపీకి బ్రాండ్‌గా ఉన్నారు. ఆయన కేంద్రమంత్రిగా వెళ్లడం.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుగా బండి సంజయ్ పదవి చేపట్టడంతో పరిస్థితులు మారిపోయాయి. తనపైన ప్రకటనలతో బండి సంజయ్ పాపులారిటీ పెంచుకున్నారు. పాదయాత్రతో మరింతగా ప్రజల్లోకి వెళ్లారు. ఈ కారణంగా బండి సంజయ్ శ్రమ అమిత్ షా దృష్టిలో పడినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మొత్తంగా ఇక నుంచి బండి సంజయ్ ప్రాబల్యం తెలంగాణ బీజేపీలో పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొంత మంది నేతలు తమ తమ ప్రాధాన్యాలపై ఆశలు పెట్టుకున్నా .. ఎవరైనా బండి సంజయ్ తర్వాతనే అన్న ఓ అభిప్రాయం కల్పించేలా తుక్కుగూడ సభ జరిగింది. ఇది బీజేపీలో కొత్త సమస్యలకు దారి తీస్తుందా లేదా వర్గ పోరాటాన్ని మరింత పెంచుతుందా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.