బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను సోమవారం నుంచి ప్రారంభించాలనుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే పోలీసులు మాత్రం చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రకటించారు. అనుమతి ఇవ్వలేదని బీజేపీ నేతలు ఊరుకునే పరిస్థితి లేదు.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులు .. పాదయాత్ర అనుమతి రద్దు చేసి.. కరీంనగర్లోని ఇంట్లో వదిలి పెట్టారు. హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకుని బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు ఐదో విడత పాదయాత్రకు మొదట్లోనే అనుమతి నిరాకరించారు పోలీసులు.
పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించడానికి వెళ్లడం ఖాయం. అయితే పోలీసులు కూడా ఊరుకునే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో కట్టడి చేస్తారు. అవసరమైతే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు బీజేపీపై మండిపోతున్నారు. ఏ చిన్న చాన్స్ వచ్చినా టీఆర్ఎస్ వదిలే అవకాశం లేదు. అందుకే సోమవారం మరోసారి భైంసా వేదికగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.