ఇటీవల తెలుగు సినిమాల కథకుడు విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఇప్పుడు ఆయన బీజేపీ సొత్తు. రాజ్యసభకు నామినేట్ చేసిన తరవాత ఆర్ఆర్ఆర్ సినిమాలో పటేల్ మాత్రమే ఎందుకున్నారు.. గాంధీ, నెహ్రూ ఎందుకు లేరు అనేదానికి ఆయినిచ్చిన వివరణ బీజేపీ నేతలకు బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో రజాకార్ ఫైల్స్ కథ రాయించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కాశ్మీర్ ఫైల్స్ బాగా భావోద్వేగాలను పెంచిందని.. ఆ తరహాలోనే సినిమా ఉండాలని బండి సంజయ్ భావిస్తున్నారు.
కశ్మీరీ పండిట్ల జీవితాలను తెరపైకి తెచ్చినట్లే… రజాకార్ల దారుణాలను ప్రజలకు చూపించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కశ్మీరీ ఫైల్స్ లాగే రజాకార్ల ఫైల్స్ ను తెరపైకి తీసుకొస్తామని… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నోసార్లు చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన తర్వాత… తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్… విజయేంద్ర ప్రసాద్ ని కలిశారు. ఆయనతో రజాకార్ల ఫైల్స్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల రోజుల ముందు… సినిమాను రిలీజ్ చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో రజాకార్ల ఫైల్స్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజు తల్చుకుంటే దెబ్బలకుకొదవా అన్నట్లు సినిమా తీయడానికి డబ్బులకు కొదవ ఉండదు. కానీ ఇలాంటి వివాదాల్లోకి విజయేంద్ర ప్రసాద్ వస్తారా అనేది మత్రం సందేహం.