తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. నలుగురూ మాట్లాడుకునే స్టేట్మెంట్లు ఇవ్వడంలో మాస్టర్ డిగ్రీని సాధించేసినట్లుగా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, దారుస్సలాం కూల్చివేతల తర్వాత తాజాగా.. తెలంగాణకు మధ్యంతర ఎన్నికల స్టేట్మెంట్ ఇచ్చేశారు. కేసీఆర్ జైలుకు వెళ్తారని కూడా చెబుతున్నారు. కేసీఆర్.. లెక్క లేనంత అవినీతి చేస్తున్నారని.. ఒక్కో డివిజన్‌కు ఐదు కోట్ల రూపాయలు పంచేందుకు పంపుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు పంచినా తీసుకుని బీజేపీకే ఓటు వేయాలంటున్నారు. ఓ రకంగా కేసీఆర్ జైలుకు పోతారని ప్రజలకు చెప్పి బీజేపీకి ఓట్లు వేయమని బండి సంజయ్ కోరుతున్నారన్నమాట.
కేసీఆర్ అవినీతి గురించి.. ఆయనను జైలుకు పంపడం గురించి బండి సంజయ్ ఇదే మొదటి సారి చెప్పడం లేదు. ఆయన టీ బీజేపీ అధ్యక్షుడయినప్పటి నుండి అవే మాటలు చెబుతున్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం కేంద్రం వద్ద ఉందని.. సమయం వచ్చినప్పుడు ఆయనను జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచుతూ కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని, కమీషన్ల కోసం కొన్ని కంపెనీలకు మేలు చేస్తోందని బండి సంజయ్ చాలా సార్లు ప్రకటించారు. సంజయ్ అలా ప్రకటనలు చేసిన తర్వాత తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు వివరాలను కేంద్రం అడిగింది. తెలంగాణ సర్కార్ ఇచ్చిందో లేదో క్లారిటీ లేదు. కానీ ఓ అడుగు ముందుకు పడిందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమయింది.
కేసీఆర్ కూడా.. బీజేపీ తనను టార్గెట్ చేసిందన్న అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. ఓ సారి ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తోందని విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కార్ విషయంలో అలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పకపోయినా .. ఇటీవలి కాలంలో జరిగిన గోవా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , మహారాష్ట్ర వంటి రాష్ట్రల అంశాలను ఆయన ఉదహరించారు. మామూలుగా అయితే కేసీఆర్ వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారన్న అర్థంలో కేసీఆర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇప్పుడు బండి సంజయ్ మళ్లీ .. కేసీఆర్ జైలు గురించి.. మధ్యంతర ఎన్నికల గురించి ప్రస్తావించారు. అవన్నీ ఆషామాషీగా కాదని.. సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అని అనుకోవాల్సిందేనన్న చర్చ ప్రారంభమవుతోంది.