తెలంగాణ ఉద్యోగులకు ఇప్పుడు జీతాలు పెద్ద సమస్యగా మారాయి. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు రెండు, మూడు రోజులు ఆలస్యం చేస్తే అదో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కానీ తెలంగాణలో మాత్రం వారాల తరబడి ఉద్యోగులకు జీతాలు లేటవుతున్నాయి. ఒక నెల రెండు నెలలు కాదు .. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. రాను రాను మరింత ఆలస్యం అవుతున్నాయి కానీ పరిస్థితి మెరుగుపడటం లేదు. దీంతో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీనే ఇస్తామన్న హామీ ప్రతిపక్ష పార్టీల ఎజెండాలో భాగం అవుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల్ని ఆకట్టుకునేందుకు ఇతర హామీల సంగతెలా ఉన్నా.. జీతాల గురించి హైలెట్ చేస్తున్నారు. ఇటీవల తాను ఎక్కడ ప్రసంగించినా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు రావాలంటే బీజేపీ రావాల్సిందేనని చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని .. ఉద్యోగులకు పిట్టకథలు చెప్పి ఏళ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదంటున్నారు.
ప్రతినెల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులకు చెల్లించేది రూ.3 వేలకోట్లని.. ఈ మాత్రం బడ్జెట్‌ను సైతం సకాలంలో విడుదల చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు, కాంట్రాక్టు సిబ్బందిపై నిర్లక్ష్యంగా వ్యవహరించండం సరి కాదంటున్నారు. నిజానికి జీతాల ఇష్యూ.. తెలంగాణప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఉద్యోగుల తో సమావేశం పెట్టి ఒకటో తేదీన జీతాలిచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకూ అమల్లోకి రాలేదు. విపక్షాలు అందకుంటున్నందున ఇక నుంచి జీతాలు ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఉద్యోగులు ఎంత కీలకమే సీఎం కేసీఆర్‌కు తెలుసు.