తెలంగాణ బీజేపీ అధ్యకుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. తన పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర అని పేరు పెట్టుకున్నారు. ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభించాలనుకున్నా… అనివార్య కారణాలతో 24వ తేదీకి మార్చుకోవాల్సి వచ్చింది. పాదయాత్ర ఏర్పాట్ల కమిటీల్లోకీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. పాదయాత్ర పేరును అధికారికంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా నామకరణం చేశామని 24వ తేదీన పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ నడక ప్రారంభిస్తారు. బండి సంజయ్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయిన దగ్గర్నుంచి పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
కానీ అనివార్య పరిస్థితులతో పదే పదే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఆయన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ లోపే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. ఓ వైపు హుజూరబాద్ ఉపఎన్నికలు జరుగుతూంటే.. మరో వైపు బండి సంజయ్ ఇలా పాదాయాత్రకు వెళ్లడం ఏమిటన్న చర్చలు బీజేపీలో సాగుతున్నాయి. అయితే హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బండి సంజయ్… అక్కడే వారం రోజుల పాటు పాదయాత్ర చేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో రెండు, మూడు వర్గాలు ఉన్నాయని వారి మధ్య సరిపడటం లేదని జోరుగా ప్రచారం సాగుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత బండి సంజయ్ కు వరుస విజయాలు లభించడంతో ఆయనే సీఎం అభ్యర్థి అని కొంత మందినేతలు ప్రకటనలు చేశారు. అప్పట్నుంచి ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినా పట్టుదలగా పార్టీలోనూ పోరాడుతున్నారు. పాదయాత్ర విషయంలో చివరి క్షణంలో అయినా నిలుపుదల చేయడానికి ఆ పార్టీకే చెందిన నేతలు హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో బండి సంజయ్ ఎవరికీ చాన్స్ ఇవ్వకుండా పాదయాత్రకు విస్తృత ప్రచారం వచ్చేలా చేసుకుంటున్నారు