తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు హైకమాండ్ నుంచి పూర్తి భరోసా లభిస్తోంది. చాలా మంది సీనియర్ నేతలు. ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్ చీఫ్ గా తాము పని చేయలేమని ఆయనను అర్జంట్‌గా మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ప్రముఖు నేతలంతా ఈ జాబితాలో ఉండటంతో బండి సంజయ్ ను మారుస్తారేమో అన్నంతగా ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటి చాన్స్ లేదని తాజాగా సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే తెలంగాణలో బీజేపీ దూకుడు తగ్గిందని.. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ చేస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపైనా కిషన్ రెడ్డి స్పందించారు. కవితను అరెస్ట్ చేయడం బీజేపీ చేతుల్లో లేదని.. దర్యాప్తు సంస్థల వద్ద ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారన్నారు. సిసోడియాను ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు.
మొత్తంగా బండి సంజయే ఎన్నికల వరకూ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ వైపు ఎన్నికలు మంచుకొచ్చేస్తున్నాయి. మరో వైపు బీజేపీలో చేరికలు లేకపోగా. చేరిన వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్ ను ఓడించాలంటే.. కలసి రావాలని .. పిలుస్తున్నారు.. మరో వైపు బీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త బాండింగ్ ఏదో ఉందన్న అభిప్రాయం పెరిగిపోతూండటంతో.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని బీజేపీలో చేరిన వారికి ఉక్కపోత మొదలైంది.