తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదని మరో పన్నెండు మంది రాజీనామాలు చేస్తున్నారని బండి సంజయ్ చెబుతున్నారు. వారంతా ప్రజలతో ఒత్తిడి చేయించుకుని మరీ రాజీనామాలు చేయబోతున్నారట. అంటే ఉపఎన్నిక వస్తే తమ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులొస్తాయని చెప్పి ప్రజలు వారు రాజీనామా చేయాల్సిందేనని ధర్నాలు చేస్తారు. దానికి తలొగ్గి వారు రాజీనామాలు చేసి బీజేపీలో చేరి మళ్లీ పోటీ చేస్తారు. బండి సంజయ్ చెప్పే దాని ప్రకారం ఇదే జరగనుంది. ఇప్పటికే 10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
అయితే ఒక వేళ నిజంగానే ఇలా చేయాలని అనుకుంటే.. ప్లాన్ ఉటే.. బండి సంజయ్ ఎందుకు బయటపెట్టారన్నది చాలా మందికి అర్థం కాని…బుర్ర చించుకున్నా అర్థం కాని సందేహం. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్ చెబెుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుండి 53 శాతం ఓట్లు వస్తాయని అనేక సర్వే సంస్థలు చెప్పాయంటున్నారు. బండి సంజయ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా కాంగ్రెస్లో అనుమానాలు కలిగేలా చేసారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మోడీ పాలనను అభినందించారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తామన్నారు. అయితే మునుగోడుతో పాటే ఉపఎన్నికలు వస్తాయా.. ఆ తర్వాత వరుసగా నెలకో ఉపఎన్నిక తీసుకు వస్తారా అన్నది మాత్రం బండి సంజయ్ చెప్పలేకపోతున్నారు.