మందుబాబులను సైతం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న రాష్ట్రం అంధ్రప్రదేశ్ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. జగన్ సర్కార్ పాలన ఈ తరహాలో ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించన ఓట్ల పరిశీలనపై హైలెవల్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి సర్కార్ ను టార్గెట్ చేశారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మద్య నిషేదం ఎందుకు అమలు చేయలేదని జగన్ ను ఆయన ప్రశ్నించారు. మద్యం పై జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదని మండిపడ్డారు. ప్రజలు హర్షించలేని స్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయిందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే, కేంద్ర ప్రభుత్వం కారణమని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే ప్రభుత్వం నడుస్తోందన్నారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారని, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే భావన ప్రజల్లో నెలకొందన్నారు బండి సంజయ్. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకు పైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైందని బండి సంజయ్ అన్నారు.
కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందన్నారు. అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. బీజేపీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్తగా నియమితులైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కుమార్తె పెళ్లి క్రైసవ ఆచార పద్ధతిలో చేసిన మాట నిజంకాదా అని ప్రశ్నించారు. తాను నాస్తికుడని ఛైర్మన్ గతంలో చెప్పలేదా అని నిలదీశారు. సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెలియదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నారని, ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమోనని ఎద్దేవా చేశారు.