రాజకీయాల్లో ఎప్పుడేమీ జరుగుతుందో చెప్పడం కష్డం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… తాను అధ్యక్ష బాధ్యతను చేపట్టినప్పటి నుండి కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. కవిత కోసం ఢిల్లీలో జైలు రెడీ చేశామని ప్రకటనలు చేస్తూ ఉండేవారు. అయితే అవన్నీ జరగలేదు కానీ..ఆయన మాత్రం జైలుకె్ళ్లిపోతున్నారు. మధ్యలో ఓసారి అరెస్ట్ అయి జైలుకెళ్లినా అది రాజకీయ పోరాటంగా మిగిలింది. కానీ ఇప్పుడు మాత్రం … టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరక పడింది. ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయడానికి మెజిస్ట్రేట్ కూడా అంగీకరించలేదు. దీంతో ఖమ్మం జైలుకు వెళ్లకతప్పలేదు.
టెన్త్ పేపర్ల లీకేజీకి కుట్ర పన్నారని పోలీసులు అరెస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. అర్థరాత్రి కరీంనగర్‌లోని ఇంట్లో ఉన్న బండిసంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకు వచ్చారు. ఈ మధ్యాహ్నం హన్మకొండ కోర్టులో ప్రవేశ పెట్టారు. రిమాండ్ రిపోర్టులో పేపర్ లీకేజీ కుట్ర పన్నారని అభియోగాలు నమోదు చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని.. ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారని అందులో కుట్ర ఉందని ఎలా అంటారని.. ఆయనతరపు న్యాయవాదులు కోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది. జడ్జి రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి ఈ కేసులో బండి సంజయ్ ప్రమేయం ఉందని చెప్పడానికి పోలీసులు చూపించిన ఒకే ఒక్క కారణం నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్‌కు ఫోన్ చేయడమే. ఆయన మాజీ జర్నలిస్టు. చాలా మంది రాజకీయ నేతలతో సంబంధాలు ఉంటాయి. ఆయన పేపర్‌ను .. ఓ మీడియా గ్రూపుతో పాటు పలువురు బీజేపీ నేతలకు షేర్ చేశారు. అలా షేర్ చేసిన వారిలో ఈటల , బండి సంజయ్ ఉన్నారు. ఈటలకు కాల్ చేయలేదు. కానీ సంజయ్ కు ఫోన్ చేశారు. దీంతో ఆయనే కుట్ర చేశారని పోలీసులు కేసు పెట్టి లోపలేశారు. డిఫెండ్ చేసుకోవడానికి కూడా సమయం లేకపోయింది. ప్రభుత్వంపై కుట్ర.. విద్యార్థుల భవిష్యత్ అంటూ పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి మెజిస్ట్రేట్ కూడా రిమాండ్‌ను నిరాకరించకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.
దీంతో తాము కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని చాలెంజ్‌లు చేసిన బండిసంజయ్ ఇప్పుడు జైలుకెళ్తున్నారు. భవిష్యత్‌లో బయటకు వచ్చి తాను అనుకున్నట్లుగా చేస్తారో లేదో కానీ.. ఇప్పటికైతే ఆయన జైలుకెళ్లారు.