తెలంగాణ రాష్ట్ర సమతిది వన్ సైడ్ లవ్ అంటున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ … హుటాహుటిన ఢిల్లీ వెళ్లి.. టీఆర్ఎస్తో వ్యవహరించాల్సిన విధానంపై క్లారిటీ తీసుకున్నారు. హైకమాండ్ పెద్దలతో భేటీ అయిన తర్వాత టీఆర్ఎస్పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుద్ధి, సిగ్గు ఉన్నవారెవరూ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరని తేల్చేశారు. బండి సంజయ్ ప్రకటనతో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది నిజంగానే వన్ సైడ్ లవ్ అని.. బీజేపీ ఎలాంటి ఆసక్తి చూపించడం లేదన్న చర్చ ప్రారంభమయింది. జైలుకు పంపొద్దని కేంద్రం దగ్గర కేసీఆర్ పొర్లుదండాలు పెడుతున్నారని అయినప్పటికీ.. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టేది లేదని బండి సంజయ్ మరోసారి హెచ్చరించారు.
బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉంటున్న ఆయన నిర్ణయాలు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికేనని చెబుతున్నారు. 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. బండి సంజయ్ అదే పనిగా చెబుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ తన పార్టీ నుంచి బీజేపీలోకి వలసల్ని ఆపడానికే.. బీజేపీతో స్నేహం ఉన్నట్లుగా నటిస్తున్నారని అంటున్నారు. అంతే కాదు.. బీజేపీలో చేరికల కోసం టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు రెడీగా ఉన్నారని చెప్పేందుకు చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు.
టీఆర్ఎస్కు నిజామాబాద్ రూరల్ స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రాజీనామా చేశారు. డిచ్పల్లి ఎంపీపీ, ఏడుగురు ఎంపీటీసీలు, 10 మంది సర్పంచ్‌లు రాజీనామా చేసి.. బీజేపీలో చేరాలని నిర్ణయించారు. వారందరూ.. బండి సంజయ్ వెంట ఢిల్లీ వెళ్లారు. వారు రేపు బండి సంజయ్ సమక్షంలో చేరనున్నారు. కేసీఆర్‌ది వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడేనని… బీజేపీ ఆయనతో ఏ రకమైన సంబంధాలు పెట్టుకోదని.. బండి సంజయ్ ఢిల్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిటన్లయిందన్న చర్చ తెలంగాణలో ప్రారంభమయింది.