గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వివాదాలు సృష్టించడానికేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తాజా ఆయన నోటి వెంట సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. అది పాకిస్తాన్ పైనో.. మరో దేశంపైనో చేస్తామని అని ఉంటే.. పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ.. హైదరాబాద్ మీద .. పాతబస్తీ మీద చేస్తామంటూ ప్రకటించారు. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలందర్నీ ఏరి వేస్తామన్నారు. బహుశా ఆయన ఉద్దేశం నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ కాకపోవచ్చు.. సోదాలు జరిపి… రోహింగ్యాలను గుర్తించి వెనక్కి పంపిస్తామన్న ఉద్దేశంలో అలా మాట్లాడి ఉంటారు.
అయితే విషయం సున్నితమైనది కావడంతో వివాదం అయిపోయింది. టీఆర్ఎస్ తరపున గ్రేటర్ ప్రచార బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్.. వెంటనే బండి సంజయ్ మాటలపై స్పందించారు. నాలుగు ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని.. దయ చేసి మత చిచ్చు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రశ్న సంధించారు. కేటీఆర్ క్విక్ రెస్పాన్స్ చూస్తే.. బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచారాస్త్రం చేయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్ ప్రధానంగా.. బీజేపీ వస్తే.. హైదరాబాద్‌లో ప్రశాంతమైన పరిస్థితులు ఉండవని.. హెచ్చరిస్తోంది. ప్రజలు ఆలోచించాలని చెబుతోంది. బీజేపీ నేతల దూకుడులో… ఇలాంటి అంశాలను బలపరిచే విషయాలను హైలెట్ చేస్తోంది. ఎవరి ప్రచార వ్యూహం వారిదే. ఎవరిది వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.