తెలంగాణ. బీజేపీ చీఫ్ ఎవరన్నది ఆ పార్టీ నేతల్లో సస్పెన్స్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలన్నది బీజేపీ లక్ష్యం. ఇప్పుడు నియమించబోయే చీఫ్ వచ్చే ఎన్నికల వరకూ ఉంటారని కిషన్ రెడ్డి చెబుతున్నారు. అంటే పార్టీని అగ్రెసివ్ గా జనాల్లోకి తీసుకెళ్లే.. తమ భావాజాలాన్ని విస్తృతం చేసే నేత ను బీజేపీ ఎంపిక చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ లీడర్ ను బండి సంజయ్ లోనే హైకమాండ్ ఎక్కువగా చూస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు రాష్ట్రంపైనే ఎక్కువ ఆసక్తిగా ఉంది. ఆ విషయాన్ని హైకమాండ్‌కు తెలిసేలా చేయగలిగారని చెబుతున్నారు. నిజానికి బండిసంజయ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ కాక ముందు బీజేపీ పరిస్థితి అట్టడుగున ఉండేది. ఆయనను చీఫ్ గా చేసినప్పుడు కూడా అంచనాలు లేవు.కానీ ఆయనను తొలగించి మళ్లీ కిషన్ రెడ్డిని చీఫ్ గా చేసినప్పుడు.. అధికారానికి పోటీపడే పరిస్థితిలో ఉంది. అది చిన్న విషయం కాదు. హైకమాండ్ దీన్ని మర్చిపోయే అవకాశం కూడా లేదు.
మళ్లీ బండి సంజయ్ అయితేనే తనదైన శైలిలో పార్టీని దూకుడుగా తీసుకెళ్లగలుగుతారని భావిస్తున్నారని చెబుతున్నారు. బీసీ వర్గం.. బలంగా తన వాదన వినిపించగలిగిన లీడర్ కావడం.. పోరాటాలకు తగ్గకపోవడం వంటివి బండి సంజయ్ కు ప్లస్. కిషన్ రెడ్డి పూర్తిగా కేంద్ర రాజకీయాలకు పరిమితమవుతారు. మరికొంత మంది నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. అంతిమంగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుదో కానీ.. బీజేపీకి అగ్రెసివ్ గా.. సిన్సియర్ గా పనిచేసే నాయకుడు రావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.