రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ చాలా సీరియస్గా తీసుకున్నారు. తాను దీక్ష చేసి పార్టీ నేతలతో కూడా చేయించిన ఆయన ఇప్పుడు న్యాయపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు. బీజేపీ లీగల్ సెల్ టీమ్ మొత్తాన్ని తెలంగాణ ఆఫీసుకు పిలిపించిన ఆయన వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పదే పదే పరిశీలించి ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చో అధ్యయనం చేయాలని కోరారు. వారు ఇచ్చే సలహాల ఆధారంగా బండి సంజయ్ కేసీఆర్పై కోర్టుకెక్కే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లీగల్ ఒపీనియన్స్ లాంటివేమీ తీసుకుకోండా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం పూర్తి చేసింది . రాజ్యాంగాన్ని అవమానించినందునన రాజద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడం వరకు ఓకే కానీ కేసులు పెట్టాలనే ఆలోచన చేయరు. అంతటి సాహసం చేసే పరిస్థితి లేదు. అందుకే బీజేపీ నేరుగా కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని కోర్టుకెళ్లే ఆలోచన చేస్తోంది.
అయితే బండి సంజయ్ తీరుపై రాజకీయవర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల కంటే అత్యంత దారుణమైన వ్యాఖ్యలు ఎన్నో సార్లు బీజేపీ నేతలు చేశారు. రాజ్యాంగం కంటే భగవద్గీతే గొప్పదని సీనియర్ బిజెపి నేతలు చాలా సార్లు చెప్పారు. బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ఈ రాజ్యాంగం పనికిరాదనీ, ఇందులో లౌకిక అనే పదాన్ని తీసేసి కొత్త రాజ్యాంగం రాయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా ఇతర బీజేపీ నేతలెవరూ స్పందించరు. కానీ కేసీఆర్ .. వ్యాఖ్యలపై మాత్రం బండి సంజయ్ ఏకంగా న్యాయపరమైన చర్యల కోసం ప్లాన్లు వేస్తున్నారు.