వడ్లు కొనుగోలు చేయవద్దని కేంద్రం చెప్పిందని తాము అందుకే కొనుగోలు చేయడం లేదని తెలంగాణ చెబుతోంది. కేంద్రం చెప్పలేదని రాష్ట్రమే కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. రెండూ అధికార పార్టీలే. పోటాపోటీగా రోడ్లెక్కి రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ రెండు రోజుల పాటు ధాన్యం సేకరణ కేంద్రాల పరిశీలన కోసం జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. నల్లగొండ నుంచి ప్రారంభిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో పరిస్థితులు.. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదు వంటి వాటిని రైతులను అడిగి తెలుసుకుంటారు.
ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణకు అనుమతి ఇస్తే తాము ఎందుకు కొనమని. ..బీజేపీ ఉత్త నాటకాలు ఆడి రైతులను మోసం చేస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే బండి సంజయ్ పర్యటనలకు ఎలా చెక్ పెట్టాలో.. బీజేపీ నతేల ప్రచారానికి ఎలా అడ్డుకట్ట వేయాలో వారికి పూర్తిగా అర్థం కావడంలేదు. ఎందుకంటే ఫిజికల్‌గా రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలి. చెల్లింపులు చేయాలి. తర్వాత కేంద్రం తీసుకుంటుంది. రైతులకు నేరుగా సంబంధం లేదు. ఇది టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారింది.
అయితే సామాన్య రైతు మాత్రం రాజకీయాల్లో పడి నలిగిపోతున్నాడు. మిర్యాలగూడ, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రైతులు ధాన్యంతో మిల్లర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. చాలా తక్కువ సెంటర్లు పెట్టారు. యాసంగిలో వరి సాగు వద్దంటున్న ప్రభుత్వం ఇప్పుడెందుకు కొనుగోళ్లు పూర్తి స్థాయిలో చేపట్టడం లేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ రాజకీయాలు చేసుకుంటున్నాయి. కానీ రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.