తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఎదుగుదల చాల మందికి నచ్చుతున్నట్లుగా లేదు. ఆయనపై నెగెటివ్ ప్రచారం ఓ రేంజ్లో చేస్తున్నారు. నేరుగా కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ… ఆయనే కేసీఆర్‌కు కరెక్ట్ అనుకునేలా ఇమేజ్ తెచ్చుకున్న బండి సంజయ్ దూకుడుకు కళ్లెం వేయాలని పార్టీలోని కొంత మంది నేతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరికి ఢిల్లీ స్థాయిలో పదవిలో ఉన్న మరో కీలక నేత సహకరిస్తున్నారు. దీంతో వీరందరూ కలిసి… బండి సంజయ్‌ను ఒంటరి చేయడానికి కొత్త రాజకీయం నడుపుతున్నారని అంటున్నారు.
ఏకగ్రీవం అయ్యే చాన్స్ లేని… డివిజన్ లో పోటీ చేయకుడా టీఆర్ఎస్ను ఒప్పించేందుకు ఇటీవల గ్రేటర్ నేతలు కేటీఆర్‌ను కలిశారు. ఆ సందర్భంలో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కేటీఆర్ కామెంట్స్ చేశారు. వాటిని బీజేపీ నేతలు సమర్థించారు. బండి సంజయ్ తప్ప… బీజేపీలో అందరూ మంచోళ్లేనని కేటీఆర్ సర్టిఫికెట్ ఇచ్చారు. దానికి అందరూ ఆమోదం తెలిపారు.ఇది బయటకు తెలియడంతో పార్టీలో కీలక హోదాల్లో ఉన్న వారే పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ చేశారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ స్థాయిలో, పార్టీలో కీలక పదవులు నిర్వహిస్తోన్న సీనియర్ నేతల డైరెక్షన్ లోనే లింగోజిగూడా డివిజన్ ఏకగ్రీవం కోసం కేటీఆర్ దగ్గరకు వెళ్ళినట్లు దాదాపుగా తేలిపోయింది.దీంతో బండి సంజయ్ త్రిసభ్య కమిటీని నియమించి నిగ్గు తేల్చాలని డిసైడయ్యారు.
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పార్టీలో మరో వర్గంతో వర్గపోరు నడుస్తోంది. బండి సంజయ్ ఎదుగుదల.. ఢిల్లీ స్థాయిలో పదవి అనుభవిస్తున్న మరో నేతకు కంటగింపుగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బండి సంజయే సీఎం అన్న నినాదాలు అక్కక్కడా వినిపిస్తూండటం… మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో బండి సంజయ్‌ను ఒంటరిని చేసే రాజకీయం బీజేపీలో జోరుగా సాగుతోంది. తనపై కుట్ర చేస్తున్నారని గుర్తించిన బండి సంజయ్.. తనపై కుట్ర చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని చాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటికే జరుగుతున్నదాన్ని మొత్తం బీజేపీ అధ్యక్షుడుకి నివేదిక పంపించారట. అయితే బండి సంజయ్ పలుకుబడి ఎక్కువా.. లేకపోతే.. ఆయనను తగ్గించాలనుకున్న నేతది ఎక్కువా అన్నది త్వరలోనే తేలనుంది.