కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అధికారం కోసం చంద్రశేఖర్ రావు ఎంతకైనా తెగిస్తాడని ఆయన అంటన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీఆరెస్ రెండుగా చీల్చుతుందని తనతో పలువురు చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం బీఆరెస్ వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే ముందస్తు కుట్రలో భాగంగానే బీజేపీ బండి సంజయ్ తో లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నదనే అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏర్పాటు అయిన ప్రభుత్వాలను బతకనీయకుండా బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నదని, దానిలో భాగంగానే బండి సంజయ్ ముందస్తు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చివేస్తారని లేనిపోని భ్రమలు కల్పించి, ఆ ప్రక్రియను బీజేపీనే పూర్తి చేస్తుందనే అనుమానాన్ని కాంగ్రెస్ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ను బూచిగా చూపించి బీజేపీ తన పని పూర్తి చేస్తుందని, ఇందుకోసం బీఆరెస్ లోని ఒక వర్గం వారిని లాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
ఇదే తరహాలో కాంగ్రెస్ లో ఉన్న కొందరిని ఈడీ, సీబీఐలను బూచిగా చూపించి తమవైపు తిప్పుకుని కలగూర గంప సర్కార్ ను ఏర్పాటు చేసే ప్రమాదముందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. మహారాష్ట్ర లో ఏకనాథ్ షిండే మాదిరి తెలంగాణలో సర్కార్ ఏర్పాటుకు బీజేపీ స్కెచ్ వేసిందని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి.