తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ ఒకటి అంటే తాను రెండు అంటున్నారు. కేసీఆర్ మాటలతో ఆయన పోటీ పడలేకపోవచ్చు కానీ.. తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. వరద సాయాన్ని బీజేపీ వల్లే ఆపేయాల్సి వచ్చిందని.. ఎన్నికలు ముగియగానే అందరికీ పంపిణీ చేస్తామని కేసీఆర్ చెప్పిన విషయంపై బండి సంజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. ఇంటికి పాతిక వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు వరదల వల్ల ఎవరెవరు ఎంతెంత నష్టపోయారో.. అంత విలువైన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అదీ కూడా కేసీఆర్ స్టైల్లోనే చెప్పారు. కార్లు నష్టపోయిన వారికి కార్లు.. బైకులు నష్టపోయిన వారికి బైకులు కూడా.. బండి సంజయ్ ఇస్తారట. తాను వరద సాయాన్ని నిలిపివేసినట్లుగా లేఖ రాసి ఉంటే.. కేసీఆర్ చార్మినార్ భాగ్య లక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.
కేసీఆర్పై ఇతర అంశాల్లోనూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ… వరద సాయం విషయంలో మాత్రం ఆయన చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచేలా చేసింది. ఎందుకంటే.. హైదరాబాద్ వరద బాధితులకు సాయం చేస్తోంది బల్దియా కాదు.. తెలంగాణ సర్కార్. బల్దియా వద్ద అన్ని నిధులు లేవు. ఐదు వందల కోట్లు కేటాయించి .. తెలంగాణ సర్కారే పంపిణీ చేస్తోంది. మరి బల్దియాలో గెలిస్తే.. బండి సంజయ్ అన్ని నిధులు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం క్లారిటీ లేదు. కేంద్రం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదు. బీజేపీ గెలిచిందన్న సంతోషంగా.. వందలు, వేల కోట్లు ప్రకటించే అవకాశం కూడా లేదు. అందుకే బండి సంజయ్.. అంత పెద్ద మొత్తంలో వరద సాయం ఎలా ఇస్తారన్నది కూడా చెప్పాల్సిందనే సూచనలు.. సలహాలు వినిపిస్తున్నాయి.
బండి సంజయ్.. కేసీఆర్పై సవాళ్లే కాదు.. వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కేసీఆర్ పక్కా దేశ ద్రోహి.. అని తిట్ల దండకం కూడా అందుకున్నారు. ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అని.. కేసీఆర్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ను తట్టుకోవాలంటే.. ఆ మాత్రం దూకుడు ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు కానీ.. ఆ హామీలు.. ఆ విమర్శలు.. మరీ ఎబ్బెట్టుగా ఉన్నాయన్న విమర్శలు మాత్రం సామాన్యుల నుంచి వస్తున్నాయి.