తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ ని వినిపించడానికి ఓ అధికార ప్రతినిధిని నియమించింది. ఆయన దాసోజు శ్రవణ్ గా గొప్ప లాజిక్ లతో మాట్లాడలేకపోవచ్చు కానీ అంతకు మించిన కామెడీ చేయగలరు. ఆయనే బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించి.. నిరాశకు గురియైన ఆయనను బుజ్జగించేందుకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి..అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బండ్ల గణేష్ కొద్ది రోజుల కిందటే.. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తాపత్రయపడ్డారు. కాంగ్రెస్ లోని గాడ్ ఫాదర్ల సాయంతో తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పరిశీలన దశలోనే నాకౌట్ అయ్యారు. దాంతో బుజ్జగింపుల కసరత్తులో భాగంగా… ఆయనకు పదవి కట్టబెట్టారు.
బండ్ల గణేష్ కు అధికార ప్రతినిధి పదవి ఇవ్వడంపై చాలా మందిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున… టీవీ చానళ్లలో డిస్కషన్ కు వెళ్తే పరువు పోతుందని.. ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలు అంటున్నారు. చిత్రవిచిత్రమైన మాటలతో ఆయన.. అందర్నీ నవ్విస్తూంటారు. కానీ ఆయన మాత్రం సీరియస్ గా ఉంటారు. బండ్ల గణేష్ ను.. ఏ ఒక్కరూ సీరియస్ గా తీసుకోరు. ఇంకేదైనా పదవి ఇచ్చి ఉంటే బాగుండేది కానీ.. అధికార ప్రతినిధి పదవి ఏమిటన్న అసంతృప్తి ఇతర కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ భక్తుడని చెప్పుకునే బండ్ల గణేష్.. జనసేన పార్టీలో చేరుకండా… కాంగ్రెస్ పార్టీలో చేరడమే విచిత్రం అయితే.. ఇప్పుడు ఆయనకు ఆ పార్టీలో అధికార ప్రతినిధి పదవి వరించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటో కానీ… కొద్దిగా టాకింగ్ పవర్ ఉన్న ఇతర పార్టీల నేతలు మాత్రం కంగారు పడిపోతున్నారు. ఆయన ఏం చేస్తారో… ఎలాంటి మాటలు మాట్లాడి.. ఎన్నికలు ముందు… పరవు తీస్తారోనని భయపడుతున్నారు. కానీ బండ్ల మాత్రం కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. టిక్కెట్ రాకపోయినా.. అసంతృప్తి వ్యక్తం చేస్తే వచ్చేదమీ ఉండదు. ఆయనకుంటూ పది మంది వర్గం కూడా లేదు కాబట్టి.. ఇచ్చిన పదవితో సర్దుకుంటే బెటరని ఆయన అనుకుంటున్నారు.