బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఈమధ్య రాజకీయాల గురించి తెగ మాట్లాడిన గణేష్ – ఇప్పుడు సినిమా ట్రాక్ లోకి వచ్చాడు. ఇక్కడా కాంట్రవర్సీ కూతలే. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో `హరీష్ శంకర్ ని స్ట్రయిట్ సినిమాలు తీసి హిట్ కొట్టమనండి చూద్దాం. నేను ఇండ్రస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా` అని ఛాలెంజ్ చేశాడు. హరీష్‌ని పవన్ కల్యాణ్‌కి పరిచయం చేసేంది తానేనని, సినిమాలు లేక కిందా మీద పడుతూ డిప్రెషన్ కి లోనైతే, అలాంటి వాడ్నిపిలిచి, ఛాన్సిచ్చింది నేనేనని… స్టేట్మెంట్లు ఇచ్చాడు.
నిజానికి గబ్బర్ సింగ్‌కి ముందే మిరపకాయ్ లాంటి హిట్టు హరీష్ శంకర్ కి ఉంది. అలాంటప్పుడు హరీష్ డిప్రెషన్లో ఉండడం ఏమిటో? పైగా హరీష్ హిట్సన్నీ రీమేకులే అన్నట్టు మాట్లాడడం కూడా కరెక్టు కాదు. మిరపకాయ్, దువ్వాడ జగన్నాథమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్…. ఇవేమీ రీమేకులు కాదు. కేవలం గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ మాత్రమే రీమేకులు. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడో? అంటే బండ్ల దృష్టిలో మిరపకాయ్, డీజే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. ఇవేమీ హిట్టు కాదా? వాటిని ఫ్లాప్స్ అంటే… బన్నీ ఫ్యాన్స్, రవితేజ అభిమానులు, సాయిధరమ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇటీవల గబ్బర్ సింగ్ కి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హరీష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో గబ్బర్ సింగ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. కావాలనే హరీష్ అలా చేశాడో, లేదంటే… మర్చిపోయాడో తెలీదు గానీ, ఈ వ్యవహారం బండ్ల గణేష్‌ని బాగా హర్ట్ చేసి ఉంటుంది. అందుకే.. హరీష్ శంకర్‌కి రీమేకులు తీయడం తప్ప, స్ట్రయిట్ సినిమా తీసి హిట్టు కొట్టలేడని ఓ నింద విసిరేశాడు. బండ్ల గణేష్ తో వ్యవహారం ఎప్పుడూ ఇలానే ఉంటుంది. నచ్చితే నెత్తిమీద పెట్టుకుంటాడు. లేదంటే టప్పున కింద పడేస్తాడు. హరీష్ విషయంలోనూ అదే జరిగింది. సాధారణంగా హరీష్‌కి కాస్త తిక్క ఎక్కువ. తనని కెలికితే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోడు. మరి గణేష్ యాక్షన్‌కి.. హరీష్ రియాక్షన్ ఏ రేంజులో ఉంటుందో???