పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే ఊగిపోయి, స్టేజీ మీద రచ్చ రచ్చ చేసేస్తుంటాడు బండ్ల గణేష్. `గబ్బర్ సింగ్`తో బండ్ల జీవితమే మారిపోయింది. దానికి కారణమైన పవన్ అంటే బండ్లకు అందుకే అంతిష్టం. తీన్ మార్ తో వచ్చిన నష్టాల్ని పూడ్చుకోవడానికి `గబ్బర్‌సింగ్` సినిమా ఛాన్సిచ్చాడు పవన్. దాంతో బండ్ల నిలదొక్కుకోగలిగాడు. అందుకే పవన్ కి భక్తుడైపోయాడు. ఈమధ్య బండ్ల ప్రొడక్షన్‌కి దూరంగా ఉంటున్నాడు. త్వరలోనే ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పవన్ తో మరో సినిమా చేయాలన్నది బండ్ల ఆలోచన. అందుకోసం ఇది వరకే రకరకాల ప్రయత్నాలు చేసినా అవేం సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం బండ్ల ఆ చాన్స్ కొట్టేసినట్టే కనిపిస్తోంది.
ఇటీవల పవన్ ని కలిశాడు బండ్ల గణేష్. ఆ సందర్భంగా సినిమా ప్రస్తావన వచ్చినట్టుంది. పవన్ భోళా శంకరుడు కదా. బండ్లకు అడిగిన వెంటనే వరం ఇచ్చేసినట్టున్నాడు. అందుకే.. `మా బాస్ ఓకే అనేశాడు. మరోసారి నా కల నిజం అవుతోంది` అంటూ పవన్ కల్యాణ్‌తో ఉన్న ఓ ఫొటోని ట్వీట్ చేశాడు బండ్ల బాబు. దాంతో.. పవన్ తో బండ్ల సినిమా ఫిక్సయినట్టే అనుకోవాలి. కాకపోతే… ఇప్పటికే పవన్ చాలామందికి మాటిచ్చేశాడు. చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఏది ముందు ఏది వెనుక…. అనేది తెలీక సతమతమవుతున్నారంతా. మరి బండ్ల తో సినిమా బండెక్కేది ఎప్పుడో?