ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీకి తప్పుకుని అధికార ప్రతినిధిగా బాధ్యతలు తీసుకుని శనివారమే ” ముంబై నుంచి హీరోయిన్లు వస్తే లేనిది ప్రకాష్ రాజ్ ను మాత్రం నాన్ లోకల్ ” అంటారా అని డిఫెండ్ చేసిన బండ్ల గణేష్ ఒక్క రోజులోనే ప్లేట్ ఫిరాయించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మద్దతు ఉపసంహరించుకున్నారు. తాను జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మొదటి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హఠాత్తుగా బండ్ల గణేష్‌కు ఏమయిందంటే… జీవిత రాజశేఖర్ ను ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేర్చుకోవడం నచ్చలేదట. చేర్చుకున్నప్పుడు సైలెంట్‌గా ఉండి.. ఆ తర్వాత కూడా సమర్థించి హఠాత్తుగా బండ్ల గణేష్ ఈ కారణం చెప్పడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ షాక్‌కు గురయింది. ఏదో రాజకీయం నడుస్తోందని.. బండ్లను ఎవరో ట్యూన్ చేశారని అనుమానిస్తున్నారు.
ఎవరో చెబితే అడ్డం తిరిగారని అనుకుంటారేమోనని.. తాను ఎవరి మాటా వినని మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఒక అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానని ఆయన చాలెంజ్ చేసారు. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం తన ధ్యేయమన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యానల్ నుంచి తప్పుకుని ఆమెపైనే జనరల్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను అని బండ్ల తెలిపారు.
అధ్యక్ష బరిలో ఉంటానన్న జీవితా రాజశేఖర్ ప్రకాష్ రాజ్ అడిగే సరికి ఆయన ప్యానల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ ఆమె మాలో కీలకంగానే ఉన్నారు. నరేష్ నేతృత్వంలోని పాత కమిటీపై అనేక చేసిన ఆరోపణలు చేశారు. దానిలో ఆమెకూ భాగం ఉంటుంది. అయితే పోటీ నివారించడానికి హేమతో పాటు జీవితను ప్రకాష్ రాజ్ ప్యానల్లోకి చేర్చుకుని బండ్ల గణేష్, సాయికుమార్‌లను పక్కన పెట్టారు. ఇప్పుడు బండ్ల గణేష్ రివర్స్ అయ్యారు. ముందు ముందు మా రాజకీయాలు మరింత టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి