రాజకీయాల్లోనే కాదు, చిత్రసీమలోనూ శాశ్వత శత్రువులు, శాత్వత మిత్రులు ఎవరూ ఉండరు. పరిస్థితుల్ని బట్టి సర్దుకుపోవడమే ఉంటుంది. ఏదైనా మతలబులు వస్తే – ‘సర్లే’ అంటూ లైట్ తీసుకుని ముందుకు సాగిపోవడమే కనిపిస్తుంది. ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకోవడం, నేరుగా విమర్శనాస్త్రాలు విసురుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే రేపన్న రోజున ఎవరి అవసరం ఎవరికి వస్తుందో ఎవరికి ఎరుక..?
అయితే బండ్ల గణేష్ మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. ఓ దర్శకుడ్ని టార్గెట్ చేస్తూ.. ఎటాకుల మీద ఎటాకులు ఇస్తూ పోతున్నాడు. ఆ దర్శకుడెవరో కాదు.. హరీష్ శంకర్. ‘గబ్బర్ సింగ్’ కి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా హరీష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో నిర్మాతగా బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. దాంతో బండ్ల బాగా హర్టయ్యాడు. ‘అసలు హరీష్‌కి రీమేకులు తప్ప. స్ట్రయిట్ సినిమాలు తీయడం రాదని, తాను స్ట్రయిట్ సినిమా తీసి, హిట్టు కొడితే ఇండ్రస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని’ ఓ రేంజులో స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయితే హరీష్ కూడా తగ్గలేదు. తనకి అవకాశం ఇచ్చింది బండ్ల గణేష్ కాదని, నాగబాబు అని, పవన్‌తో ములాఖాత్ నాగబాబు వల్లే అయ్యిందని క్లారిటీ ఇచ్చేశాడు.
దాంతో.. బండ్లకు ఇంకెక్కడో గుచ్చుకుంది. అందుకే ట్విట్టర్లో లేటెస్టుగా కొన్ని హాట్ హాట్ కామెంట్లు పెట్టాడు. తింటున్నంత సేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. నీతో అవసరం ఉన్నంత సేపూ, వరుసలు కట్టి మాట్లాడతారు, అవసరం తీరాక లేని మాటలు అంటగడతారు – అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీటు ఎవరిని ఉద్దేశించి అన్నదో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. బండ్ల గార్గెట్ ఎవరో అర్థమైపోతోంది. ”శత్రువుకి మన విజయాలే కాదు. మన పరాజయాలూ తెలియాలి.. అప్పుడే వాటిని మనం వాటిని ఎదిరించి ఎలా నిలబడ్డామో కూడా తెలుస్తుంది” అంటూ మరో ట్వీట్ వేశాడు. మొత్తానికి బండ్ల బండి ఇప్పట్లో ఆగేట్టు లేదు. ఈన ఈగో ఈ రేంజులో హర్టవుతుందని బహుశా.. హరీష్ శంకర్ కూడా ఊహించి ఉండడు. ఏదైతే అయ్యింది. ఈ లాక్ డౌన్ వేళ, చప్పగా సాగిపోతున్న చిత్రసీమకు తన ట్వీట్లతో కాస్త వేడి అంటించాడు.