‘పవన్ కల్యాణ్ నాకు జీవితం ఇస్తే… చిరంజీవి నాకు పునః జన్మ ఇచ్చారు’ – ఇదీ బండ్ల గణేష్ తరచూ చెప్పేమాట. మెగా ఫ్యామిలీకి తను ఎంత విధేయుడో అవసరమొచ్చినప్పుడల్లా నొక్కి వక్కాణిస్తూనే ఉంటారు. `మా` ఎన్నికల హడావుడి మొదలవ్వగానే, చిరంజీవి సపోర్ట్ తో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నారని తెలియగానే.. ప్రకాష్ రాజ్ కి జై కొట్టిన మొట్ట మొదటి వ్యక్తి బండ్ల గణేషే. `ప్రకాష్ రాజ్‌కి చిరంజీవి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆరు నూరైనా నేను ప్రకాష్ రాజ్ గెలుపు కోసమే కృషి చేస్తా. ఇది కూడా చేయకపోతే… నాకు విశ్వాసం లేనట్టే“ అంటూ స్టేట్మెంట్లూ ఇచ్చాడు.
తీరా చూస్తే.. ఒక్క రోజులో పరిస్థితి తారుమారైపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జీవిత పేరు చూసి బండ్ల హర్టయ్యాడు. అందుకే ప్యానల్ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పోస్టు కి పోటీ చేస్తున్నాడు. అదీ.. జీవితకి వ్యతిరేకంగా. జీవితపై పోటీకి దిగాడంటే ఓరకంగా ప్రకాష్‌రాజ్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే. ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకమైతే.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకం అన్నట్టే. మరి ఇదంతా బండ్ల తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? అనేదే పెద్ద ప్రశ్న.
బండ్ల ఎర్ర జెండా ఊపడం వెనుక కారణం.. జీవితనే. గతంలో రాజశేఖర్ కుటుంబానికీ, చిరుకీ మధ్య విబేధాలు తెలియనివి కావు. చిరుపై జీవిత రాజశేఖర్‌లు నిప్పులు గక్కిన సందర్భాలెన్నో. `మా` డైరీ ఆవిష్కరణ రోజున చిరు, ఇతర పెద్దలు స్టేజీపై ఉన్నప్పుడే రాజశేఖర్ తన నిరసన గళాన్ని విప్పడం గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ బండ్ల తన వ్యతిరేకతకు కారణాలుగా చూపిస్తున్నాడు. జీవిత రెండేళ్ల పదవీ కాలంలో.. ఏమీ చేయలేదని, అందుకే తనకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. జీవితపై పోటీ చేసి మెగా కుటుంబానికి మరింత దగ్గర కావాలని బండ్ల ప్రయత్నం కావొచ్చు. మరి ప్రకాష్ రాజ్‌కి మద్దతు ఇచ్చిన చిరు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాడా? ప్రకాష్ రాజ్ గెలుపు ఓరకంగా.. చిరు గెలుపు. అలాంటప్పుడు బండ్ల తన విధేయతని ఎలా చూపుకున్నట్టు?
‘జీవిత పోటీనుంచి తప్పుకుంటే.. అప్పుడు నేనూ పోటీ నుంచి తప్పుకుంటా’ అనేది బండ్ల గణేష్ తాజా కామెంట్. కాకపోతే ఇప్పటికే జీవితకు ప్రకాష్ రాజ్ మాట ఇచ్చేశాడు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న జీవిత, కాస్త కిందకు దిగి ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరింది. ఆమెకు జనరల్ సెక్రటరీగా తన ప్యానల్ లో చోటు ఇవ్వడం సమంజసమే. అలాంప్పుడు బండ్ల గణేష్ కోసం జీవితని పోటీ నుంచి ఎందుకు తప్పిస్తారు? అలా చేస్తే ప్రకాష్ రాజ్ వెనకడుగు వేసినట్టే. కాబట్టి జీవిత తప్పుకోవడం ఉండదు.. బండ్ల పోటీ చేయకుండా ఉండడు. ఒకవేళ చిరంజీవి రంగంలోకి దిగి, బండ్లని వెనక్కి లాగితే తప్ప, బండ్ల తిరుగుబాటు ఆగదు.