బండ్ల గణేష్ మొదట కమెడియన్. తర్వాత డిస్ట్రిబ్యూటర్. ఆ తర్వాత ప్రొడ్యూసర్. ఆ తర్వాత పొలిటిషయన్. ఇప్పుడు డాన్… నమ్మాల్సిందే. ఎందుకంటే.. ఆయన నేరుగా ప్రముఖ వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వెళ్లి… అంతు చూస్తామని బెదిరించి వచ్చారట. దీనికి ఆయన ఒక్కరే పోలేదు. పక్కన తనతో పాటు నలుగుర్ని తీసుకెళ్లారట. ఈ మేరకు పీవీపీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల గణేష్ తో పాటు… ఆయనతో పాటు పీవీపీ ఇంటికి వెళ్లిన వారు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
అసలు పీవీపీ ఇంటికి బండ్ల గణేష్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే… టెంపర్ సినిమా సమయంలో… పీవీపీ వద్ద.. ఏడు కోట్లు అప్పు తీసుకున్నారు. సినిమా ఫైనాన్స్ పేరుతో రూ. ఏడు కోట్లు తీసుకుని… టెంపర్‌లో పెట్టుబడి పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి.. కొంత మొత్తం చెల్లించారు. ఇంకా కొంత మొత్తం బ్యాలెన్స్, వడ్డీ కట్టాల్సి ఉంది. అయితే.. పీవీపీకి సినిమా రిలీజ్ తర్వాత బ్యాంకులో వేసుకునేలా చెక్కులు ఇచ్చి బండ్ల గణేష్ అప్పటికి సర్దుబాటు చేసుకున్నారు. టెంపర్ రిలీజ్ అయింది. రోజులు గడుస్తున్నా.. పీవీపీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదట. చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. వాటిని చెల్లించాలని ఒత్తిడి తెస్తూండటంతో… అంతిమంగా.. బెదిరింపు బాటను బండ్ల గణేష్ ఎంచుకున్నారని పీవీపీ ఆరోపిస్తున్నారు.
నిజానికి టెంపర్ సినిమా విషయంలో బండ్ల గణేష్ పై చాలా వివాదాలు ఉన్నాయి. సచిన్ జోషి అనే మరో ఉత్తరాదికి చెందిన సినిమా హీరో, నిర్మాతను కూడా దారుణంగా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా కేసులు పెట్టారు. సచిన్ జోషిని పెట్టి.. టెంపర్‌ను హిందీలో రీమేక్ చేస్తానని .. డబ్బులు వసూలు చేశారని.. తర్వాత ఆ రైట్స్ ఇతరులకు ఆమ్మేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సచిన్ జోషి కేసులు కూడా పెట్టారు. ఆ కేసుల్లో బండ్ల గణేష్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా పీవీపీ కూడా కేసు పెట్టారు.