పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పరమ భక్తుడు నిర్మాత బండ్ల గణేష్. ఈ విషయాన్ని ఆయనే కొన్ని వందలసార్లు ప్రకటించుటాడు. ‘పవన్ కళ్యాణ్ నా దేవుడు. మా ఇంటి పూజ గదిలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది.” అని మైకు పట్టుకుని ఊగిపొతుంటాడు గణేష్. ”తీన్ మార్ తర్వాత ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో వున్నపుడు.. మళ్ళీ దేవుడిలా ఆదుకున్నారు పవన్. నేనున్నాను. మరో సినిమా చేసుకో గని అని చెప్పి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చి, నాకు నిర్మాతగా జన్మనిచ్చిన దేవుడు పవన్ కళ్యాణ్” అని స్వామీ భక్తిని చాటుతుంటాడాయన.
ఇప్పుడు ప్రెజెంట్ లోకి వస్తే.. ‘టెంపర్’ తర్వాత మళ్ళీ కనిపించలేదు బండ్ల గణేష్. ఒక రిమేక్ సినిమాని అనుకున్నారు కానీ కాంబినేషన్ సెట్ కాలేదు. తర్వాత ఆయన ఊసేలేకుండా పోయింది. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో ప్రత్యేక్షమయ్యాడు బండ్ల గణేష్. కాసేపు కబుర్లు చెప్పుకున్నారట. ఓ ఫోటో కూడా దిగాడు.”నా దేవుడితో. బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్’ అనే ట్వీట్ తో ఈ ఫోటోను షేర్ చేశాడు బండ్ల. దీంతో బండ్ల గణేష్ కి పవన్ మరోసారి ఛాన్స్ ఇచ్చాడా? పవర్ స్టార్ తో మరో సినిమాను బండ్ల గణేష్ నిర్మించనున్నాడా? అంటూ చర్చలు మొదలైపోయాయి. అయితే పవన్ డేట్స్ ఇప్పట్లో ఏ నిర్మాతకీ దొరికే ఛాన్స్ కనబడటం లేదు. కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాలి పవన్ . దీనికి చినబాబు నిర్మాత. తర్వాత ఎఎం రత్నం సినిమా లైన్ లో వుంది. మధ్యలో దాసరి సినిమా కూడా అటు ఇటుగా వుంది. ఇవి పూర్తయినప్పటికి 2019 ఎలక్షన్ దగ్గర పడతాయి. సో..కొత్త నిర్మాతలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ బాగా తక్కువ. అయితే ఇలా కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్. ఎలాంటి సంచలన నిర్ణయం అయినా రావచ్చు మరి.