మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తానని టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు బండ్ల గణేష్. కానీ ఆయనకు ఏదీ కలసి రావడంలేదు.
ఇటీవల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా బండ్ల గణేష్ కి విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. బండ్లపై ఎన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయో లెక్కే లేదు. ఎన్ని సార్లు శిక్షలు పడ్డాయో కూడా అంచనా వేయలేం. ప్రొద్దుటూరు దగ్గర్నుంచి హైదరాబాద్ వరకూ ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు.
ఈ చెక్ బౌన్స్ కేసుల సంగతి పక్కన పెడితే.. తాజాగా హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ ఇంటి వ్యవహారంలోనూ ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఈడీ స్వాధీనపర్చుకున్న ఇంటిని మోసపూరితంగా విక్రయించే ప్రయత్నం చేసిందని బండ్ల గణేష్ తనయుడు హీరేష్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఫిలింనగర్ రోడ్డునెంబర్–13 సైట్–2లోని ప్లాట్‌నెంబర్ 15–ఏలో నౌహీరా షేక్‌కు చెందిన ఇంటిని తన కుమారుడు హీరేష్ పేరుతో బండ్ల గణేష్ అద్దెకు తీసుకున్నారు.
దానిని నౌహీరా అమ్మే ప్రయత్నం చేసింది. అయితే దానిని మేమే కొంటామని హీరేష్ మూడు కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని కానీ ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తనకు తెలిసిందని, దానిపై వివరణ అడిగితే మిగతా డబ్బులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తుందని, ఇల్లు ఖాళీ చేయాలంటూ డిమాండ్ చేస్తుందని హీరేష్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే విషయంలో బండ్ల గణేష్ కూడా జోక్యం చేసుకున్నారు. తన ఆఫీస్ కు వచ్చిన ముస్లిం దంపతులతో గణేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా వీడియో వైరల్ అయింది. బండ్ల గణేష్ నుండి తమకు తమకు ప్రాణహాని ఉందని హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు
దాడి చేయడమే కాక కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పి భయబ్రాంతులకి గురయ్యేలా చేస్తున్నాడని అన్నారు. మా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఈడీ అనుమతి తప్పని సరి అని చెప్పిన కూడా ఆయన యూట్యూబ్‌లో హోమ్ టూర్ చేసి మరీ పెట్టాడని నౌహీరా పేర్కొంది. ఈ వివాదాలతో బండ్ల గణేష్ రాజకీయ ఆశలకు పులిస్టాప్ పడినట్లేనని చెబుతున్నారు.