వారాంతం వస్తే మెట్రో నగరాల్లో సందడి సగమైతాదని అందరూ చెప్పుకుంటారు.. కానీ సందట్లో సడేమియాలో కూడా రెట్టింపు అవుతాయి. ఈ విషయం పోలీసులు రైడింగ్ చేసినప్పుడల్లా తెలిసిపోతుంది. బెంగళూరు పోలీసులు ఖాళీగా ఉన్నామని అనుకున్నారో.. అసలు ఆదివారం వస్తే.. క్లబ్లు, హోటళ్లు, స్పాల్లో ఏం జరుగుతుందో చూద్దామనుకున్నారో కానీ.,. ఓ స్పెషల్ ఆపరేషన్ తరహాలో రెయిడ్స్ చేశారు. అంతే.. వారికి ఎక్కడికి వెళ్లినా… కేసుల మీద కేసులు దొరికాయి. అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా బస్సుల్ని పిలిపించాల్సి వచ్చింది. మొత్తంగా మూడు వందల మందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వీరంతా.. జల్సా చేయడానికి వచ్చిన వారు కాదు. అసాంఘిక కార్యకలాపాలు.. వ్యభిచారం చేస్తున్నవారే.
బెంగళూరు నగరంలో పోలీసులు మొత్తంగా ఓ యాభై క్లబ్, స్పా, హోటళ్లను టార్గెట్ చేసుకుని సోదాలు చేశారు. పదకొండు స్పాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా గుర్తించారు. మరో పదకొండు క్లబ్లలోనూ అదే పరిస్థితి. మరో పన్నెండు హోటళ్లలో ప్రధాన వ్యాపారం వ్యభిచారమేనని గుర్తించారు. అయా చోట్ల.. విటుల్ని.. యువతుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదేమంత చిన్న కేసులు కావని.. ఈ మొత్తం వెనుక భారీ రాకెట్ ఉందని బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశంలో ప్రధాన నగరాల్లో .. వ్యభిచారం అనేది ఓ ప్రధానమైన వ్యాపారంగా ఉంది. అంతా గుట్టుగా సాగిపోతుంది. దీని వెనుక రాకెట్ ఉంటుంది. పెద్ద ఎత్తున విదేశీ యువతుల్ని కూడా పిలిపిస్తూ ఉంటారు. ప్రతి రోజూ ఎక్కడో చోట.. పోలీసులకు చిక్కుతూనే ఉంటారు. కానీ వారెవరికీ శిక్షలుపడవు. సూత్రధారులెవరో బయటకు రారు. దాంతో వారి వ్యాపారం..అలా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఓ సారి మొత్తం వ్యవస్థను చెక్ చేద్దామని చూస్తే.. ఇలా… సోదాలు చేసిన ప్రతీ చోటా… దొరికిపోతూ ఉంటారు.