అది మంగళవారం (11-08-2015) ఉదయంపూట అనేకపనుల నిమిత్తం బెంగళూరువాసులు ఆ రోడ్డు ఎక్కారు. ఉన్నట్టుండి షాక్ కి గురై ఆగిపోయారు. ఒక భయంరమైన సర్పం ,అదికూడా అతిపెద్ద అనకొండ రోడ్డుమీద కనిపించింది. ఎంతటి ధైర్యస్థులైనాసరే గుండె ఆగిపోయేటంతటి భయంకరదృశ్యం అది. డ్రైనేజ్ గుంటలోనుంచి అప్పుడే పాక్కుంటూ బయటకువచ్చినట్టుంది ఈ అతిపెద్ద అనకొండ. తోకభాగం ఇంకా డ్రైనేజ్ గోతిలోనే ఉంది. నోరు భయంకరంగా తెరుచుకుని ఉంది. పైగా అప్పుడే మనిషిపై దాడిజరిపినట్టు దానినోట్లో మనిషి చెయ్యిలోని కొంతభాగం కనిపిస్తోంది. అక్కడంతా మనిషి తాలూకూ రక్తం మరకలు. ఇదీ సీను. అనకొండ మాత్రం ఏమాత్రం కదలకమెదలక అలాగే పడిఉంది. ఎందుకని?
ఎందుకంటే…
రోడ్డెక్కిన వాళ్లు ఈ అనకొండను చూడగానే విస్తుపోయారు. బెంగళూరు మనదేశపు ఐటీ రాజధానిగా గుర్తింపుపొందింది. అయినా అక్కడి రోడ్లు మాత్రం చెత్తాచెదారాలతో , పొంగిపొర్లుతున్న డ్రైన్లతో వానాకాలం వచ్చిందంటే చాలు, నరకం చూపిస్తుంటాయి. కొద్దిపాటి వానకే రోడ్లు కాలవులుగా మారిపోతుంటాయి. రోడ్లు మరమ్మతులు చేపట్టాల్సిన అధికారుల్లో చైతన్యం కలగడంలేదు. అందుకే `నమ్మ బెంగళూరు ఫౌండేషన్’ (ఎన్.బి.ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఒక ఆలోచనచేసింది. లైవ్ సైజ్ లో అనకొండ బొమ్మను తీసుకొచ్చి అది నాలాలోనుంచి రోడ్డుమీదకు వచ్చి ఓ మనిషిని అప్పుడే పట్టి తినేసినట్టుగా భ్రాంతి కలిగేలా రద్దీగా జనం తిరిగే ప్రాంతంలో ఉంచారు. రోడ్లు బాగుచేయాడానికి సత్వరం కదలిరండి, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని బెంగళూరు మహానగర పాలికకు తెలియజెప్పాలనే ఎన్.బి.ఎఫ్ ఈపని చేసింది.
బెంగళూరు రోడ్డుమీదకు క్రూరజంతువులు వచ్చేయడం ఇది కొత్తేమీకాదు. అంతకుముందు విజువల్ కళాకారుడు బాదల్ నంజుడస్వామి 12 అడుగుల పొడవున్న మొసలిరూపాన్ని ఉత్తర బెంగళూరులోని ఒక రోడ్డుమీద ఇలాగే పొంగిపొర్లుతున్న నాలానీటి మడుగువద్ద ఉంచాడు.
వానాకాలం నాలాలు పొంగడం ఒక్క బెంగళూరులోనేకాదు, హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి. జీహెచ్ఎంసీ ఎన్నిసార్లు రోడ్లు మరమ్మత్తులు చేసినా ఐదు సెంటీమీటర్ల వానపడితేచాలు, నాలాలు పొంగుతూనే ఉంటాయి. ఒక్కోసారి నాలాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. అయినా పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ కలలోమాత్రమే ఊహించే పరిస్థితే ఉంది.
– కణ్వస