తెలుగు360 రేటింగ్: 2.5/5
ఈసారి సంక్రాంతి పండగ బరి చాలా సినిమాలే ముస్తాబయ్యాయి. చాలా అంచనాలతో ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో… చివరి నిమిషంలో విడుదల తేదీని ఖరారు చేసుకుని అసలు సిసలు పండగ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది `బంగార్రాజు`. సంక్రాంతికే వచ్చి విజయవంతమైన `సోగ్గాడే చిన్నినాయనా`కి సీక్వెల్ ఇది. పండగలాంటి సినిమా కాబట్టి పండగకే వస్తున్నాం అంటూ ప్రచారం చేసింది చిత్రబృందం. మరి సినిమా ఎలా ఉంది? పండగ జోష్ని పెంచుతుందా లేదా?
`సోగ్గాడే చిన్నినాయనా`లో బంగార్రాజు తన కొడుకు రాము (నాగార్జున) కాపురాన్ని చక్కబెట్టడం కోసం పై నుంచి కిందకి వచ్చాడు. ఈసారి రాము కొడుకు చిన బంగార్రాజు (నాగచైతన్య) కోసం పెద్ద బంగార్రాజు కిందకొస్తాడు. తల్లి చిన్నప్పుడే పోవడంతో నానమ్మ సత్యభామ (రమ్యకృష్ణ) అన్నీ తానై మనవడిని చూసుకుంటుంది. తాత పోలికలు రావడంతో చిన్నప్పట్నుంచే సరసాలు మొదలు పెడతాడు. అది చూసి నానమ్మ కూడా మరణిస్తుంది. అలా బంగార్రాజు, సత్యభామ ఇద్దరూ పైన కలుస్తారు. మనవడు ఎలా ఉన్నాడో చూద్దామని పైనుంచి ఓ లుక్కేస్తారు. గడుసోడైన చిన బంగార్రాజుకి, అంతే గడుసమ్మాయైన నాగలక్ష్మి(కృతిశెట్టి)కీ పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోతారు. అందుకోసం పెద్ద బంగార్రాజు ఆత్మ కిందకొస్తుంది. మరి చిన బంగార్రాజునీ, నాగలక్ష్మిని కలిపాడా లేదా? గుడికి, చిన బంగార్రాజు ఏర్పడిన ముప్పుని బంగార్రాజు ఎలా తొలగించాడనేదే మిగతా కథ.
తొలి సినిమా కథ ఎక్కడ ముగిసిందో అక్కడే మొదలవుతుంది ఈ కథ. తొలి సినిమా తరహాలోనే కుటుంబంలో ఓ సమస్య, గుడిలో నాగబంధం వంటి అంశాలతో కథ ముందుకు నడుస్తుంది. సినిమా మొదలైన అరగంటలోనే కథా గమనం అర్థమైపోతుంది. అలాంటి కథతోనూ ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం ఓ పెద్ద సవాలే. ఇక్కడే దర్శకుడు నాగార్జున, నాగచైతన్య కలయికని పక్కాగా వాడుకున్నాడు. వాళ్లిద్దరి జోడీని, కెమిస్ట్రీని వాడుకుంటూ సన్నివేశాల్ని అల్లాడు. తొలి సగభాగం కథంతా చిన బంగార్రాజు బాల్యం, అతను తాత పోలికలతో సందడి చేసే వైనంతో సరదాగా సాగిపోతుంది. చిన బంగార్రాజునీ, నాగలక్ష్మినీ కలపాలని సత్యభామ నిర్ణయించడం, ఆమె కోరిక మేరకు బంగార్రాజు కిందకి రావడం నుంచి కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. అక్కడక్కడే చిన్న చిన్న మలుపులు, సరదా సన్నివేశాలతో కాలక్షేపం చేయించారు. సమస్య వచ్చినప్పుడంతా చిన బంగార్రాజులోకి పెద్ద బంగార్రాజు ఆత్మ దూరిపోవడంతో సన్నివేశాలన్నీ ఊహాజనితంగా ముందుకు సాగుతాయి. బలంగా నవ్వించే సన్నివేశం ఒక్కటి కూడా లేకపోవడం ప్రధాన లోపం. అలాగని వినోదం పండించేందుకు ఆస్కారం లేదని కాదు. బ్రహ్మాజీ, వెన్నెలకిషోర్, ఝాన్సీ తదితరుల నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటితో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఒకట్రెండు చోట్ల దర్శకుడు రాసుకున్న మాటలతో హాస్యం పండింది. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం కొంచెం పర్వాలేదనిపిస్తుంది. కథలో సంఘర్షణతోపాటు, అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. ముఖ్యంగా అత్తమామల్ని కోడళ్లు ఎలా అర్థం చేసుకోవాలి? కాలం మారిన పరిస్థితుల్లో కోడళ్లనీ అత్తమామలు ఎలా చూడాలో చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లో మలుపులు కూడా మెప్పిస్తాయి. విలనిజం బలంగా లేకపోవడం సినిమాకి మైనస్‌గా మారింది. పండగ సినిమాలకి బీ, సీ సెంటర్ ప్రేక్షకుల బలం ఎక్కువగా ఉంటుంది. వాళ్లకి కావల్సిన సరుకు మాత్రం ఇందులో పుష్కలంగా ఉంది. ఎంత కాదన్నా సీక్వెల్ అన్నప్పుడు తొలి సినిమాని తప్పనిసరిగా గుర్తు చేసుకుంటాడు ప్రేక్షకుడు. దాంతో పోలిస్తే ఏ దశలోనూ ఈ సినిమా ఉన్నతంగా అనిపించదు. నాగార్జున, రమ్యకృష్ణ ఇద్దరూ ఆత్మలుగా కనిపిస్తారు. వాళ్లే కథని నడిపించడంతో ఇదొక ఆత్మల కథలా అనిపిస్తుంది.
నటీనటులే ఈ సినిమాకి ప్రధానబలం. ప్రధానంగా చిన బంగార్రాజు, పెద బంగార్రాజు, సత్యభామ, నాగలక్ష్మి… ఈ నాలుగు పాత్రల చుట్టే కథ నడుస్తుంది. సోగ్గాళ్లుగా చిన బంగార్రాజుగా నాగచైతన్యని ఈ కథలోకి తీసుకురావడం తెలివైన నిర్ణయం. నాగార్జున, నాగచైతన్యల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. పెద బంగార్రాజు ఆత్మ ప్రవేశించినప్పుడు నాగచైతన్య నటించిన విధానం, హావభావాలు సినిమాకి కలిసొచ్చాయి. నాగలక్ష్మిగా కృతిశెట్టి నటించిన తీరు కూడా మెప్పిస్తుంది. యువ సర్పంచ్‌గా ఆమె చేసే హంగామా , పబ్లిసిటీ పిచ్చి నవ్విస్తుంది. రమ్యకృష్ణ, నాగార్జున జోడీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ, వెన్నెలకిషోర్, ఝాన్సీ, రావు రమేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కామెడీ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి వాళ్ల పాత్రలు. సంపత్‌రాజ్ తాంత్రికం నేర్చిన విలన్‌గా కనిపిస్తారు.
టెక్నికల్ టీమ్‌లో కెమెరా, మ్యూజిక్ విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. అనూప్ పాటలు, వాటి చిత్రీకరణ కూడా బాగుంది. యువరాజ్ పల్లెటూరి నేపథ్యాన్ని తెరపై చూపించిన తీరు మెప్పిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయి. పతాక సన్నివేశాల్లో పాము నేపథ్యంలో సన్నివేశాల్లో ఏమాత్రం సహజత్వం లేదు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ బంగార్రాజు పాత్రని మరోసారి తెరపై చూపించాలనుకున్నాడు తప్ప, ఆ పాత్రని డిమాండ్ చేసేంత కథయితే లేదు. మాటల పరంగా ఆయన పనితనం మెప్పిస్తుంది.
కొత్తదనం, ఆసక్తి కొరవడిన కథ కథనాలతో రూపొందిన ఓ సగటు సినిమా ఇది. పండగ వాతావరణానికి తగ్గ హంగులకి మాత్రం ఇందులో కొదవలేదు.
తెలుగు360 రేటింగ్: 2.5/5