బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ కి షాక్ తగిలింది. మూడు వన్డేల సిరిస్ లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన భారత జట్టు సీరిస్ ని కోల్పోయింది. తొలి వన్డే లో ఒక్క వికెట్ తేడాతో గెలిపొందిన బంగ్లా జట్టు.. రెండో మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సిరిస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు అనూహ్యంగా రాణించింది. 19 ఓవర్లకు 69/6.. బంగ్లా టాప్ఆర్డర్ అంతా పెవిలియన్‌కు చేరింది. ఇక వందలోపే బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు చుట్టేస్తారని అంతా అనుకొన్నారు. ఐతే మరోసారి బంగ్లా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తమ ప్రతాపం చూపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన మెహిదీ హసన్ (100 ), మహముదుల్లా (77 )అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జోడించారు. దీంతో 271పరుగులు సాధించారు.
లక్ష్య ఛేదనలో భారత్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (5), శిఖర్ ధావన్ (8) పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ ( 82), అక్షర పటేల్ ( 56) తో ఆకట్టుకున్నారు. అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పై మళ్ళీ బంగ్లా పట్టు సాధించింది.
గాయపడిన రోహిత్ శర్మ ఎనిమిదో వికెట్ గా వచ్చి భారత అభిమానుల్లో ఆశలు రేపాడు. మంచి ఇన్నింగ్ ఆడాడు కూడా. 28 బంతులో 51 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్ లో 20 పరుగులు కావాలి అనగా 14 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి సిక్స్ కావాలి. యార్కర్ గా వచ్చిన ఆ బంతి సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో ఐదు పరుగుల విజయంతో బంగ్లా జట్టు సిరిస్ ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 48 ఓవర్ కీలక పాత్ర పోషించింది. ఆ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన సిరాజ్ సింగల్ తీసి రోహిత్ కి స్ట్రయిక్ ఇచ్చుంటే పరిస్థితి మరోలా వుండేది. కానీ ఒక్క బంతిని కూడా బ్యాట్ కి కనెక్ట్ చేయలేకపోయాడు సిరాజ్. ఈ ఓవర్ రన్ రేట్ పై దెబ్బకొట్టింది.