హైదరాబాద్: సీవీఆర్ న్యూస్, సీవీఆర్ భక్తి, సీవీఆర్ హెల్త్, సీవీఆర్ ఇంగ్లీష్ ఛానల్స్ నడుపుతున్న ఇమేజ్ గ్రూప్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. జుబ్లీ హిల్స్‌లో ఉన్న సీవీఆర్ న్యూస్ ఛానల్ ఆఫీస్‌ను బ్యాంక్‌లు స్వాధీనం చేసుకుని వేలానికి పెట్టాయి. సీవీఆర్ గ్రూప్ గడిచిన రెండేళ్ళుగా రుణాలను సకాలంలో చెల్లించకపోవటంతో అప్పులిచ్చిన బ్యాంక్‌లు ఆ గ్రూప్ ఆస్తులను అమ్మటానికి రంగం సిద్ధం చేశాయి.
ఇమేజ్ హాస్పిటల్స్, తదితర సంస్థల గ్రూప్ అధినేత చలసాని వెంకటేశ్వరరావు న్యూస్ ఛానల్ ప్రారంభానికి ముందు తనకు చెందిన వివిధ ఆస్తులు తాకట్టు పెట్టి నిధులు సేకరించారు. అయితే తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకుండా డీఫాల్టర్‌గా మారటంతో ఆయన తాకట్టు పెట్టిన ఆస్తులను బ్యాంకులు అమ్మకానికి పెడుతున్నాయి. రు.10 కోట్ల రుణానికి సంబంధించి డీఫాల్ట్ కావటంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నెల 13వ తేదీన సీవీఆర్ న్యూస్ ఛానల్ ఉన్న భవనాన్ని స్వాధీనం చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్‌తో సహా నాలుగు ఫ్లోర్లు ఉన్న ఈ భవనంతోపాటు ఎల్లారెడ్డిగూడాలో ఒక ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఫ్లాట్‌పై ఉన్న రుణానికి సంబంధించి ఇమేజ్ ఫైనాన్స్ కూడా హామీదారుగా ఉంది. మరోవైపు ఇమేజ్ గ్రూప్ పేరుమీద అమీర్ పేటలో ఉన్న స్థలాన్నికూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులన్నింటినీ ఈనెల 13న స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు సీవీఆర్ నుంచి చెల్లింపులు లేకపోవటంతో బ్యాంక్ ఆస్తులను వేలానికి పెట్టింది. ఆస్తులు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఆస్తుల యజమానులకు రెండు వారాల గడువు ఇస్తారు. ఆ గడువు ఈనెల 27న ముగియటంతో బ్యాంక్ అదే రోజున ఆస్తులను అమ్మకానికి పెట్టింది. సీవీఆర్ న్యూస్ ఛానల్ ఆఫీస్ రిజర్వ్ ధర రు.15.34 కోట్లు కాగా, ఎల్లారెడ్డిగూడాలో స్థలం విలువ రు.9.57 కోట్లుగా బ్యాంక్ తమ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఆస్తులను డిసెంబర్ 30వ తేదీన వేలం విధానంలో అమ్మనున్నారు.
మరోవైపు డిసెంబర్ 30న జరిగే వేలాన్ని ఆపేందుకు సీవీఆర్ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రూప్‌కు చెందిన ఇమేజ్ హాస్పిటల్, ఇమేజ్ గార్డెన్స్‌తో సహా పలు ఆస్తులు తాకట్టులో ఉండటం, ఆస్తులకు సంబంధించిన పత్రాలు సరిగ్గా లేకపోవటం, వాటి చుట్టూ ఉన్న లిటిగేషన్స్ వల్ల అమ్ముడుపోవటంలేదని చెబుతున్నారు. ఇంత పెద్ద గ్రూప్ యాజమాన్యం కేవలం రు.12 కోట్ల రుణంకోసం ఇలా బజారున పడటం విచిత్రంగా ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే సీవీఆర్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు, ఉద్యోగులు రోడ్డెక్కారు. సీవీఆర్ యాజమాన్యం కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా బాధించటమేకాకుండా, ఆందోళన చేస్తున్నవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణకు ఫిర్యాదు చేశారు. సంస్థ ఛైర్మన్ సీవీ రావు సమస్యలను పరిష్కరించకపోగా సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో పనిచేసిన తమకు బకాయిలు చెల్లించటం లేదని, ప్రావిడెంట్ ఫండ్‌కు కట్టాల్సిన మొత్తాన్నికూడా కట్టటంలేదంటూ వినతిపత్రం సమర్పించారు.
కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన చలసాని వెంకటేశ్వరరావు తొలుత ట్రాన్స్పోర్ట్ రంగంనుంచి వచ్చారు. రియల్ ఎస్టేట్ ద్వారా భారీగా సంపాదించారు. ఇమేజ్ గార్డెన్స్, ఇమేజ్ ఆసుపత్రిని స్థాపించారు. టీవీ5 ఛానల్ యాజమాన్య బోర్డ్‌లో కొంతకాలం డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ అనుభవంతో సొంత ఛానల్స్ పెట్టారు. మ్యాగజైన్లు కూడా ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌నుంచి వచ్చిన వ్యక్తులకు పెత్తనం అప్పగించటంతో ముప్పు ఏర్పడిందని చెబుతున్నారు. సీవీఆర్ కుమార్తె జోక్యం ఎక్కువేనని అంటున్నారు. మరి ఈ సంక్షోభంనుంచి ఇమేజ్ గ్రూప్ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.