ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడితే.. మొదటగా ఎవరు నష్టపోయేది..? ఆర్థిక రంగంపై ఏ మాత్రం. అవగాహన ఉన్న వారి నుంచి వచ్చే సమాధానం మొదటగా బ్యాంకులే. ఎందుకంటే… ఆర్థిక వ్యవస్థ నడిచేది బ్యాంకులు ఇచ్చే రుణాల మీదే. ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీ దగ్గర్నుంచి చిన్నా చితకా వ్యాపారి చేసుకునే సింగిల్ హ్యాండ్ బిజినెస్ వరకూ.. ఎవరూ.. సొంత డబ్బులు పెట్టి వ్యాపారాలు చేయరు. అందరూ బ్యాంకు లోన్ల ద్వారానే.. వ్యాపారం చేస్తూంటారు. కరోనా దెబ్బకు వచ్చే ఆర్థిక మాంద్యం కారణంగా.. వారు అప్పులు తీర్చలేకపోతే.. వాళ్లకేం కాదు.. కానీ బ్యాంకులు మాత్రం దివాలా తీస్తాయి. దీన్ని బట్టి చూస్తే.. బ్యాంకులకు ఇప్పుడే భవిష్యత్ ప్రళయం కళ్ల ముందు కనిపిస్తోంది.
కంపెనీలు నడవకపోతే బ్యాంకులకు “రీ పే” ఎలా చేస్తారు..?
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఎక్కడిదక్కడ స్తంభించింది. కరోనా వైరస్ను మరో పదిహేను రోజుల్లో కట్టడి చేసినా.. ఆ తర్వాత బండి ట్రాక్ ఎక్కే సరికి మరో నెల పడుతుంది. అంటే.. అప్పటికే వ్యాపార సంస్థలన్నీ.. అప్పుల్లోకి జారిపోయి ఉంటాయి. అవి తాము తీసుకున్న రుణాల వాయిదాలను.. రీ పే చేయడానికి అవసరమైన నగదును కూడా సమకూర్చుకోలేని పరిస్థితికి వెళ్లిపోతారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల్లో లిస్ట్ అయిన నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు… బ్యాంకులు… ఇతర ఆర్థిక సంస్థల వద్ద తీసుకున్న రుణాలు .. రూ. 15 లక్షల కోట్ల పైమాటే. ఇప్పుడు ఈ కంపెనీల వ్యాపారాలన్నీ లాక్ డౌన్ అయిపోయాయి. నిబంధనల ఈ కంపెనీలు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి.. మూడు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే.. అవి నిరర్థక ఆస్తులుగా మారిపోతాయి. అయితే.. ఈఎమ్ఐలపై.. ఆర్బీఐ మారటోరియం విధించడంతో.. ఈ గండం నుంచి కంపెనీలు బయటపడతాయి.
బ్యాంకులన్నీ నిరర్థక ఆస్తులుగా మారిపోతాయా…
అయితే.. కంపెనీల నుంచి రావాల్సిన రుణాల వడ్డీ మొత్తం రూ.35,000 కోట్లు వచ్చే మూడు నెలల్లో బ్యాంకులకు ఆగిపోతాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో వడ్డీ రూ. లక్షా నలభై ఎనిమిది వేల కోట్లు బ్యాంకులకు చేరాల్సి ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయి ఆయా కంపెనీలకు రావాల్సిన నికర ఆదాయం పదిహేను శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా. అదే జరిగితే.. బ్యాంకులకు చెల్లింపులు చేయలేవు. డిఫాల్ట్ అవడం ఖాయం. ఇలా కంపెనీలు డిఫాల్ట్ అయితే.. బ్యాంకులు ఏమీ చేయలేవు. తనఖా పెట్టిన ఆస్తులు వేలం వేసుకుని చచ్చినోడి పెళ్లిక వచ్చిందే కట్నం అనుకుని సర్దుకోవాలి. కానీ ఆస్తులు వేలం వేయడం అంత తేలిక కాదనే విషయం.. విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి.. బాకీలు తీర్చుకుందామనుకున్న బ్యాంకులకు ఎదురైన అనుభవాలే నేర్పుతున్నాయి.
ఎస్ బ్యాంకును ఆదుకున్నట్లు.. ఎన్ని బ్యాంకుల్ని ఆదుకోగలరు..?
కరోనా ఎఫెక్ట్ రాక ముందే… బడా కార్పొరేట్ కంపెనీలు.. ప్రైవేట్ బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ వద్ద.. రూ. వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టాయి. ఆ దెబ్బకు.. ఎస్ బ్యాంక్ భవితవ్యమే ప్రమాదంలో పడింది. కేంద్రం.. అన్ని బ్యాంకులతో చందాలేయించి.. ఎలాగోలా ఆ బ్యాంకును నిలబెట్టింది. కానీ రాబోయే రోజుల్లో.. ఆర్థిక మాంద్యం ముదిరితే.. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే.. మొట్టమెదటగా ప్రభుత్వ రంగ బ్యాంకులే బలవుతాయి. ఇప్పటికే పది లక్షల కోట్లకుపైగా నిరర్థక ఆస్తులు ఉన్న బ్యాంకులు… రాబోయే సంక్షోభాన్ని తట్టుకోలేవన్న అంచనా ఉంది.