పేరుకే అవి ప్రభుత్వ రంగ బ్యాంకులు. సామాన్య ప్రజలకు మాత్రం పెద్దగా ఉపయోగపడవు. బడా కార్పొరేట్లకు మాత్రం వేల కోట్ల రుణాలను సంతోషంగా సమర్పిస్తాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పార్లమెంటుకు తెలిపిన విషయం.
సామాన్యులకు ఓ 50 వేల పర్సనల్ లోన్ కావాలన్నా, రైతుకు లక్ష రూపాయల పంట రుణం కావాలన్నా సవాలక్ష కొర్రీలు పెడతాయి మన బ్యాంకులు. మంత్రి గారు వెల్లడించిన వివరాల ప్రకారం, ఒకే వ్యక్తికి లేదా సంస్థకు అక్షరాలా ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పనంగా లోన్ ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడాటం లేదు. అలా దేశంలో 44 బడా కార్పొరేట్ కంపెనీలకు ఒక్కో దానికి 5000 వేల కోట్ల రూపాయలకు పైగా రుణం ఇచ్చాయట. ఈ 44 మంది బడా బాబులకు ఇలా ఇచ్చిన లోన్ మొత్తం ఎంతో తెలుసా? 4 లక్షల 87 వేల కోట్ల రూపాయలు. వీరిలో ఏ ఒక్కరు అప్పు చెల్లించకపోయినా బ్యాంకుకు కనీసం 5000 వేల కోట్ల నష్టం వస్తుందన్న మాట. మరి ఆ స్థాయిలో వీరు ఏ ష్యూరిటీ ఇచ్చి ఉంటారు? అది ఆ బ్యాంకులకు లేదా దేవుడికే తెలియాలి.
ఇలా బడా బాబులకు వేల కోట్ల చొప్పున రుణాలు పంచి పెట్టిన పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ముందు వరుసలో ఉన్నాయట. వీటిలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఔదార్యం వర్ణనాతీతం. బడా కార్పొరేట్ల యోగక్షేమం కోరి ఈ బ్యాంకు ఏకంగా 39 మందికి ఒక్కొక్కరికి 5000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చేసింది. ఈ మొత్తం 4.42 లక్షల కోట్ల రూపాయలు. కార్పొరేట్ రుణాలు పెరిగే కొద్దీ మొండి బాకీలు, రాని బాకీలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలకు ఓ అందమైన ఇంగ్లిష్ పేరు పెట్టుకున్నారు. అదే నాన్ ప్రాఫిటబుల్ ఎకౌంట్ (ఎన్ పి ఎ). ఈ ఏడాది మార్చి నాటికి ఈ మొండి బాకీల మొత్తం 2 లక్షల 67 వేల కోట్ల రూపాయలు. ఇందులో బడా బాబుల మొండి బకాయిలే అధికమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకు అంటే ప్రజా ధనంతో నడిచే బ్యాంకులు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం వీటితో పెద్దగా ఉపయోగం ఉండదు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని చులకనగా చూడటం చాలా బ్యాంకులకు అలవాటు. ఓ రైతు లక్షల రూపాయల రుణం పొందడం మామూలు విషయం కాదు. ఒకవేల ఇ ఎం ఐ ఆలస్యమైతే పదే పదే అడుగుతారు. అదే, వేల కోట్లు అసలు వడ్డీ ఏళ్ల తరబడి కట్టని కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా వంటి వారిని గట్టిగా అడిగే ధైర్యం చాలా బ్యాంకులకు ఉండదు. పైగా అతడే బ్యాంకుల చైర్మన్లను దబాయిస్తాడు. ఇదీ, మన దేశంలో సర్కారీ బ్యాంకుల బాగోతం.