గ్యారంటీ ఇస్తాం అప్పులు ఇవ్వండి అని బ్యాంకుల వద్దకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి బ్యాంకర్లు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇదంతా తీసుకుని ఖర్చు పెట్టేసుకుని తరవాత ఐపీ పెట్టేసే ఖాతా అని అనుకుంటున్నారేమో కానీ.. అప్పులు ఇవ్వాలంటే ఆస్తులు తనఖా పెట్టాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ముందూ వెనుక ఆలోచించకుండా వారి కోరికను తీర్చేస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి ఆస్తులు ఏమైనా ఉంటే.. వాటిని బ్యాంకులకు తనఖా పెడుతున్నారు. విశాఖలో ఇప్పటికే 213 ఎకరాలను బ్యాంకుల కన్సార్షియానికి తాకట్టు పెట్టేశారు. ఆ పత్రాలను పక్కాగా రిజిస్టర్ చేసి.. బ్యాంక్ అధికారులకు అందించి వచ్చారు.
ఇప్పుడు.. ఇతర ఆస్తులను కూడా అలాగే తాకట్టు పెట్టడానికి గుర్తిస్తున్నారు. అమరావతిలో ఆస్తులను తాకట్టు పెట్టడానికి సాధ్యం కాదు కాబట్టి… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖలో ఆస్తులకు మంచి విలువ ఉంటుంది కాబట్టి.. అక్కడి ఆస్తులను ఎక్కువగా తాకట్టు పెట్టాలని … ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తులతో పాటు ఆదాయన్ని కూడా ప్రభుత్వం తాకట్టు పెడుతోంది. రుణం ఇస్తాం.. తిరిగి చెల్లించేందుకు.. ఆదాయాన్ని కూడా ఎస్క్రో చేయాలని బ్యాంకులు చెబుతున్నాయి. ఎస్క్రో అంటే… తమకు ఏ సోర్స్‌తో చెల్లిస్తారో.. ఆ సోర్స్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని నేరుగా.. ఓ ఖాతాకు మళ్లించడం. ఇప్పటికే మద్యం విషయంలో మందు బాబుల్ని పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వం.. ఆ ఆదాయాన్నంతా బ్యాంకుల కిస్తీలకు చెల్లించడానికి మళ్లిస్తోంది. త్వరలో మరిన్ని పన్ను ఆదాయాలను అలా తాకట్టు పెట్టేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది.
వచ్చే ఆదాయం కన్నా… ఖర్చు నాలుగైదు రెట్లు ఎక్కువ ఉండటంతో ప్రభుత్వానికి ఆర్థికంగా దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఎన్ని అప్పులు చేసినా.. ఆస్తులు అమ్మకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఏ మాత్రం బాధ్యత గా ఫీలవకుండా.. కలెక్టరేట్లు.. ఎమ్మార్వో కార్యాలయాలను కూడా అడ్డగోలుగా తాకట్టు పెట్టడానికి ఏపీ సర్కార్ ఏ మాత్రం సంకోచించడం లేదు. ఆదాయాన్ని తాకట్టు పెట్టడం.. కార్పొరేషన్ల పేరుతో.. ఆస్తులన్నీ బదలాయించడం చట్ట విరుద్ధమన్న వాదనలు వినిపిస్తున్నాయి. జరిగేదేదో జరుగుతుందని.. ఏపీ సర్కార్ మాత్రం ఏపీని తాకట్టు పెట్టుకుంటూ మందుకెళ్తోంది.
రెండేళ్ల సంక్షేమ పథకాల కోసం.. దాదాపుగా లక్ష కోట్లకుపైగా అప్పులు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏటా రూ. 30వేల కోట్లను వడ్డీలు.. వాయిదాలుగా చెల్లిస్తోంది. ఈ భారం రాను రాను పెరగనుంది. ఈ మొత్తం తర్వాత ప్రజల నెత్తినే పడనుంది.