చాలా కాలం తర్వాత ఆర్బీఐ రెపో రేటును ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించడంతో ఆ ప్రయోజనాలను ఇళ్ల కొనుగోలుదారులకు బదిలీ చేసేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీరేట్ల కోతను ప్రకటిస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పరిస్థితులు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు.
కరోనా తర్వాత కొద్ది రోజులు అచ్చేదిన్ వచ్చాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఆరు నుంచి ఏడు శాతం మధ్యవరకూ వచ్చాయి. కాస్త సిబిల్ స్కోర్ బాగున్నవారికి ఆరు శాతానికి కూడా లోన్లు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్న కారణంగా ప్రతి మూడు నెలలకోసారి రెపోరేటును ఆర్బీఐ పెంచుకుంటూ పోయింది. చివరికి హోమ్ లోన్ వడ్డీ రేట్లు 9 శాతానికిపైనే స్థిరపడ్డాయి. సిబిల్ స్కోర్ బాగోలేకపోతే అది పదిన్నర నుంచి పదకొండు వరకూ ఉంది.
ఈ వడ్డీ రేట్ల కారణంగా ఇరవై ఏళ్లకు లోన్ తీసుకున్న వారికి మరో పదేళ్లు అదనంగా కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గితే మళ్లీ అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటిస్తున్నాయి. కొత్త లోన్లకు కూడా ఇవి వర్తిస్తాయి. ఈ కారణంగా ఇళ్లకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.