అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ కాంబో ఎప్పుడో ఖరారైపోయినా…. సినిమాకి సంబంధించిన అప్ డేట్ బయటకు రావడం లేదు. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందేమో అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. నిజానికి అలాంటి ప్రమాదం ఏమీ లేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చక చక జరుగుతున్నాయి. కథానాయిక దగ్గర్నుంచి, సంగీత దర్శకుడు వరకూ అంతా ఖరారైపోయారు. అయితే… ఎనౌన్స్మెంట్ ఎలా చేయాలా? ఎప్పుడు చేయాలా? అనేదే ఆలోచిస్తున్నారు. ఈ ప్రకటన కాస్త వినూత్నంగా ఉండాలని బన్నీ భావిస్తున్నాడట. అందుకే.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేం బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడుతూ, అన్నీ ఒకేసారి, అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నాడు.
ఈ సినిమా కోసం… త్రివిక్రమ్ ఓ రీమేక్ కథ ఎంచుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. త్రివిక్రమ్ రీమేక్ కథ చేయాలన్న ఆలోచన పక్కన పెట్టాడని, సొంతంగా ఓ కథ రాశాడని, అది బన్నీకీ నచ్చిందని తెలుగు 360 ముందే చెప్పింది. అనుకున్నట్టునేగా.. ఈసారి త్రివిక్రమ్ కొత్త కథతోనే వస్తున్నాడు. డిసెంబరు 31న గానీ, జనవరి 1న గానీ…. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన, నటీనటులు వివరాలతో సహా ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. జనవరి నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి