ఏపీలో మత మార్పిళ్లు ఉద్యమంలా జరుగుతున్నాయని బడుగు, బలహీన వర్గాల్లోని పేదలను టార్గెట్ గా పెట్టుకుని ఇష్టారీతిన మతం మత్తులో ముంచి రాజకీయంగా బానిసల్ని చేసుకుంటున్నారన్న నివేదికలు చాలా కాలంగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ వర్గాలే ఈ విషయాలను వెల్లడించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంలో ఉండే అధికారులు… ప్రభుత్వ పెద్దలు అంతా మతం మార్చుకున్న వారే కావడంతో ఈ అరాచకానికి అడ్డే లేకుండా పోతోందన్నదానికి అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో బాప్టిజం ఘాట్లను నిర్మిస్తున్నట్లుగా బయటపడింది. గుంటూరు జిల్లాలో ఓ చోట ఇలా నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ వ్యవహరానికి సంబంధించిన వీడియోను సోము వీర్రాజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హిందూ దేవాలయాల భూములు,కానుకలు ఇష్టానుసారం ఖర్చు చేస్తూ హైందవ సంస్కృతి బలోపేతానికి అర కొర నిధులతో చేతులు దులుపుకునే ఈ ప్రభుత్వం , నేరుగా మతమార్పిడికి వీలుగా బాప్తీస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం? అని ఆయన ప్రశ్నించారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉండి ఇలాంటి మత మార్పిళ్లను ఆపడం ఎంత సేపని.. సోము వీర్రాజును ఎక్కువ మంది కామెంట్లలో ప్రశ్నించారు. జగన్ కు మద్దతుగా ఉంటూ అన్ని అరాచకాల్లో భాగం కల్పిస్తూ మతమార్పిళ్ల విషయంలోనూ చూసీచూడకుండా ఉంటున్నారని అంటున్నారు. ఏపీలో క్రైస్తవ మత వ్యాప్తి విస్తరణకు ప్రభుత్వ ప్రోత్సాహకంతో చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రానికి ఎన్ని ఫిర్యాదులు అందినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ఎంపీ నందిగం సురేష్ తన ఎంపీ ల్యాడ్స్ తో చర్చి నిర్మిస్తే పట్టించుకోలేదని అంటున్నారు.
మొత్తంగా ఏపీలో మత మార్పిళ్ల విషయంలో బీజేపీ, వైసీపీ వ్యూహాత్మకంగా కలిసి పని చేస్తున్నాయన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో బలపడుతోంది.