హైదరాబాద్: యావత్ ప్రపంచంలో శక్తిమంతుడు, అగ్రరాజ్య అధినేత అయిన బరాక్ ఒబామా కంటతడి పెట్టుకున్నారు. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాపించిన గన్ కల్చర్‌పై మాట్లాడుతుండగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) మద్దతు ఉన్నా, లేకున్నా ఈ గన్ కల్చర్‌ను నియంత్రించి తీరుతానని అన్నారు. గన్ కల్చర్‌కు బలైపోయిన వారి కుటుంబసభ్యులతో వైట్ హౌస్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఒబామా పాల్గొన్నారు. 2012 డిసెంబర్లో కనెక్టికట్‌లో ఒక ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలు కాల్పులకు గురైన ఘటన తలుచుకుంటే తనకు ఇప్పటికీ బాధగా ఉంటుందని చెప్పారు. ఈ మాటలు అంటున్నపుడు ఒబామా కళ్ళవెంట కన్నీళ్ళు కారాయి. వాటిని తుడుచుకుంటూ, గన్ కల్చర్ నియంత్రణకు అడ్డుపడుతున్న రిపబ్లికన్ పార్టీపై మండిపడ్డారు. గన్ లాబీని, ముఖ్యంగా నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. గన్స్ ఉన్నవారందరినుంచీ వాటిని తీసేసుకోవటం తన ఉద్దేశ్యం కాదని అన్నారు. తన స్వస్థలం షికాగోలో కూడా గన్ కల్చర్ బాగా ఉందని చెప్పారు.