కొన్ని చానళ్ల కక్కుర్తి కారణంగా మొత్తం టీఆర్పీ రేటింగ్‌లకే ఎసరు వచ్చి పడింది. మూడు నెలల పాటు న్యూస్ చానళ్లకు రేటింగ్‌లు ఇవ్వడం నిలిపి వేస్తున్నట్లుగా బార్క్ ప్రకటించింది. టీవీ చానళ్లకు ఎంతెంత ప్రజాదరణ ఉందో కనిపెట్టేందుకు బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ రేటింగ్‌లు ఇస్తుంది. ఈ సంస్థ రేటింగ్లను ఇచ్చేందుకు ఓ ప్రత్యేకమైన పద్దతి పాటిస్తుంది. మీటర్లను కొన్ని ఎంపిక చేసిన నగరాలు, ఇళ్లలో పెట్టి.. ఆ ఇళ్లలోని వారు ఏ టీవీని.. ఎంత సేపు చూస్తున్నారన్నదాన్ని విశ్లేషించి.. రేటింగ్‌లు ఇస్తుంది.
ఈ పద్దతి గురించి తెలుసుకున్న కొన్ని టీవీ చానళ్లు.. రేటింగ్ మీటర్లు ఉన్న ఇళ్ళల్లో ఉండేవారికి డబ్బులు ఇచ్చి తమ టీవీని ఆన్ చేసిపెట్టేలా చేస్తున్నారు. ఇలా మ్యానిపులేట్ చేయడంతో కొన్ని టీవీచానళ్లు పెద్ద ఎత్తున రేటింగ్‌లు సంపాదిస్తున్నాయి. ఈ స్కాం ఇటీవల బయటపడింది. రిపబ్లిక్ టీవీ , ఇండియాటుడే చానళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతకు ముందు కూడా.. మరి కొన్ని టీవీ చానళ్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లుగా వెలుగులోకి వచ్చింది.
దీంతో బార్క్ సంస్థ… అసలు ఈ రేటింగ్‌లు ఇచ్చే విధానమే లోపభూయిష్టంగా ఉందని నిర్ధారణకు వచ్చింది. లోపాలు సరిదిద్దేదుకు మూడు నెలల సమయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పటి వరకూ న్యూస్ చానళ్లకు ఎలాంటి రేటింగ్‌లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చారు. అంటే వచ్చే మూడు నెలల పాటు నెంబర్ వన్ చానెళ్లేవీ ఉండవన్నమాట. ఒక్క ఇంగ్లిష్ న్యూస్ చానల్స్ కే కాదు.. అన్ని భాషల్లోని న్యూస్ చానల్స్‌కు రేటింగ్స్ నిలిపివేస్తున్నారు.