తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు తెరాసలోకి బాగానే వలసలు వచ్చేశారు. ఇంకా రావచ్చుననే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ఇదంతా బాగానే ఉంది. మరి ఆయా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎప్పటినుంచో గులాబీ పార్టీనే నమ్ముకుని.. అక్కడ పార్టీ జెండాలు మోస్తూ బతుకుతున్న అక్కడి నియోజకవర్గ స్థాయి నాయకులు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే ఫిరాయించిన తర్వాత.. తాము కూడా ఎమ్మెల్యేలు కావాలనే వారి ఆశలు అడుగంటిపోతాయి కదా.. లాంటి సందేహాలు రేకెత్తడం సహజం. అయితే.. తెదేపా ఎమ్మెల్యేలు ఫిరాయిస్తుండడాన్ని పురస్కరించుకుని, ఆ నియోజకవర్గాల్లోని పాత గులాబీలు.. కొత్త బేరాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎటూ తాము ఎమ్మెల్యే కాగల ఆశలను పార్టీ సమాధి చేసేసింది గనుక.. ‘ఇతరత్రా’ తమకు ప్రయోజనాలు కల్పించాలని బేరాలు పెడుతున్నారుట. తెదేపా ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చిన దాదాపు ప్రతిచోటా.. ఇన్నాళ్లూ సదరు తెదేపా వారితో పోరాడిన గులాబీ నేతలు పార్టీ నాయకత్వం వద్ద ఇలాంటి డిమాండ్లే వినిపిస్తున్నారని సమాచారం.
ఫరెగ్జాంపుల్.. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తెరాస ఇన్చార్జి సుదాకర్ రావు ఇప్పుడు పార్టీ నిర్ణయాల మీద కత్తులు నూరుతున్నారు. ఇన్నాళ్లూ నియోజకవర్గం స్థాయిలో తమకు శత్రువుగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకరరావు పార్టీలో చేరడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోయేది లేదని చెబుతున్నారు. ఇక్కడి పార్టీ వ్యవహారాల మీద ఒక మంత్రుల కమిటీని వేయాలన కూడా ఆయన కోరుతున్నారు. మంత్రుల కమిటీ వేయించుకుని, వారిద్వారా బుజ్జగించే చర్యలు మొదలైతే గనుక.. ఆయా మంత్రుల ద్వారా.. కనీసం ఇతరత్రా ప్రయోజనాలు ఏమైనా కలిగేలా బేరాలాడుకోవచ్చుననేది ఈ నేతల ఆలోచనగా కనిపిస్తున్నది. మొత్తానికి అధికార పార్టీ గనుక.. అప్రతిహతంగా కొనసాగుతున్న పార్టీ గనుక.. ఈ అంసతృప్తులతో ఎవ్వరూ పార్టీని వీడరు గానీ.. అందరికీ విడివిడిగా బుజ్జగింపులు మాత్రం అవసరం అవుతాయని పార్టీలో అనుకుంటున్నారు.