కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష కోసం అన్ లైన్ లో స్వచ్చందంగా ప్రచారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోకి ఎక్కింది. బర్లు కాసుకుంటున్న వీడియోతో బర్రెలక్కగా పేరొందిన శిరీషా అనూహ్యంగా నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంంది.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీలోకి దిగారు. బర్రెలక్కకు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మద్ధతు పలికారు. శిరీషాకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించారు. తనను తాను బర్రెలక్క గానే ప్రమోట్ చేసుకుంటున్నారు శిరీష. తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్ లో ఓ పాటను విడుదల చేసింది.
వినూత్న ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతున్న బర్రెలక్కకు యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయల విరాళం పంపించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నిరుద్యోగి శిరీషా తనకు ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్ ను మారుస్తానని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆన్ లైన్ లో ఆమెకు మద్దతుగా ప్రచారం పెరుగుతోంది. పోలింగ్ నాటికి సునామీ అయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
కానీ బయట నుంచి వచ్చే మద్దతు సరే.. కొల్లాపూర్ ప్రజల్లో చైతన్యం వస్తేనే ప్రయోజనం ఉంటుంది. కొల్లాపూర్ లో ఇద్దరు ఉద్దండులు ప్రధాన పార్టీల తరపున పోటీ పడుతున్నారు. వారికి బర్రెలక్క శిరీష గట్టి పోటీ ఇచ్చేలానే ఉన్నారు.