మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బసవరాజు సారయ్య తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించినందున తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. అయితే పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారిపై సస్పెన్షన్ వేటు వేయడం వలన ఏమీ ప్రయోజనమూ ఉండదని అందరికీ తెలుసు. ఆయన వరంగల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయంలో మంత్రి పదవిని కూడా పొందారు. కానీ తెలంగాణాలో పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతుండటంతో, వరంగల్ గ్రేటర్ ఎన్నికలకు ముందు తెరాస పార్టీ ఆహ్వానం అందుకొని తెరాస పార్టీలోకి వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు.
“కాంగ్రెస్ పార్టీలో నాకు చాలా సముచిత గౌరవమే లభించింది. కాంగ్రెస్ పార్టీ అండతోనే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను. సోనియా గాంధీ దయవలనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని నేను బలంగా నమ్ముతున్నాను. కనుక అందుకు ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. కానీ తప్పడం లేదు. నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్నాను కనుక దానిపై రాళ్ళు వేయాలనుకోవడం లేదు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెరాసతో కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే నేను తెరాసలో చేరాను తప్ప పదవులు ఆశించి కాదు,” అని సారయ్య చెప్పారు.
ఒక సగటు రాజకీయ నాయకుడు ఏవిధంగా వ్యవహరిస్తాడో సారయ్య కూడా సరిగ్గా అదేవిధంగా వ్యవహరించారని చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ అండతోనే తను ఈ స్థాయికి ఎదగ గలిగానని చెప్పుకొంటూనే, ఆ పార్టీ వలన తనకు ఇక ఏ ఉపయోగం ఉండదని గ్రహించి, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తన రాజకీయ భవిష్యత్ కి భరోసా కల్పించగల తెరాసలో చేరుతున్నారు. ఆవిధంగా పార్టీలు మారే చాలా మంది నేతల్లాగే ఆయన కూడా ‘తెలంగాణా అభివృద్ధి’ వగైరా అంటూ కొన్ని పడికట్టు పదాలు చిలకలాగ పలికేసి పార్టీ మారిపోతున్నారు. అయితే తను ఏ పార్టీ ద్వారా ఈ స్థాయికి చేరుకోగలిగానని కృతజ్ఞతతో చెప్పుకొంటున్నారో, ఆ పార్టీ కష్టకాలంలో ఉందని తెలిసి ఉన్నప్పుడు దానికి అండగా నిలబడి, దానిని కాపాడుకొనే ప్రయత్నం చేసి ఉంటే అదే నిజమయిన కృతజ్ఞత అనిపించుకొంటుంది. అలాకన్నప్పుడు అది అవకాశావాదమే అవుతుంది.