పేదలకు అతి తక్కువ ధరకు క్యాన్సర్ వైద్యం అందించే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని అమరావతిలో నిర్మించాలని ఆ ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ నిర్ణయించారు. నిజానికి ఈ ఆస్పత్రి నిర్మాణం ఈ పాటికి పూర్తి కావాల్సింది. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా ముందుకు అడుగు పడలేదు. ఇప్పుడు మళ్లీ అమరావతికి మంచి రోజులు వస్తూండటంతో ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించారు. ఇందు కోసం అమరావతిలో పదిహేను ఎకరాలను కేటాయించారు. ఇటీవల జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేశారు. అయితే ఆ స్థలంలో హెచ్టీ కరెంట్ తీగలు ఉండటంతో అండర్ గ్రౌండ్ ద్వారా వాటిని రీప్లేస్ చేసేందుకు పనులు చేపట్టనున్నారు.
కొన్ని వందల కోట్లు వెచ్చించి ఆస్రత్రిని నిర్మించనున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో హైదరాబాద్లోని ఆస్పత్రి కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వచ్చేవారు. నిరుపేదలకు కాన్సర్ వైద్యం దాదాపుగా ఉచితంగా అందిస్తారు. విరాళాలు ఎన్నారైలు ఇస్తూంటారు. ప్రపంచప్రఖ్యాత వైద్యులు నోరి దత్తాత్రేయుడు వంటి వారు సేవలు అందిస్తూంటారు. ఈ ఆస్పత్రి ఏపీ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే పేదలకు అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యం అతి తక్కువకు అందించవచ్చని భావిస్తున్నారు.
బాలకృష్ణ సొంత డబ్బులను కూడా ఆస్పత్రికి కేటాయిస్తూ ఉంటారు. ఆయన ప్రకటనల్లో నటిస్తే వచ్చే సొమ్మును క్యాన్సర్ ఆస్పత్రికే ఇచ్చేస్తూంటారని చెబుతూంటారు. లాభాపేక్ష లేకుండా పూర్తిగా ఆస్పత్రి నిర్వణను సేవా దృక్పథంతోనే నిర్వహిస్తూ.. పేదలకు అద్భుతమైన సేవలు అందిస్తోంది. ఏపీలో వేగంగా నిర్మితమైతే.. కొన్ని వేల మంది క్యాన్సర్ రోగులకు సాయంగా ఉంటుంది. జనవరిలో నిర్మాణం ప్రారంభించి వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది.